గులాబ్ తుపాను(GULAB EFFECT) ధాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లావ్యాప్తంగా జోరు వాన కురిసింది. నరసన్నపేట నియోజకవర్గంలో భారీ వర్షం(heavy rain)తో జనజీవనం అస్తవ్యస్తమైంది. నరసన్నపేట, జలుమూరు మండలాలను కలిపే రహదారిపై మోకాళ్లలోతు నీరు నిలిచి... రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అనేక గ్రామాల్లో వరికి తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు...అరటి చెట్లు నేలకూలాయి. ఎగువ ప్రాంతాలతో పాటు మడ్డువలస రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో.. నాగావళిలో నీటి ప్రవాహం పెరిగింది. పరివాహక ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. సంతబొమ్మాళి మండలంలోని సముద్రతీర ప్రాంత గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. సంతబొమ్మాళి, నౌపడ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. రహదారికి అడ్డంగా నేలకూలిన చెట్లను సిబ్బంది తొలగించారు. ఆక్వా చెరువుగట్లు ధ్వంసమయ్యాయి. ఆర్.సున్నాపల్లిలోని పునరావాస కేంద్రానికి గ్రామస్తులను తరలించారు. టెక్కలి పోలీసు అతిథి భవనం పరిసరాల్లో వర్షం నీరు నిండిపోయింది. ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం గెడ్డకంచారంలో భారీ వర్షాలు, ఈదురు గాలులకు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలి...7 బైక్‌లు ధ్వంసమయ్యాయి. లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో అనేక కాలనీలు నీటమునిగాయి. అరటి, మొక్కజొన్న, బొప్పాయి లాంటి వాణిజ్య పంటలు నేలకొరిగాయి. రాజాం, పాలకొండ ప్రధాన రహదారిపై నీరు ప్రవహించడం వల్ల...వాహనదారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. రేగిడి మండలంలోని ఆకులలో వనిగడ్డ పొంగడంతో అనేక గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి.
స్తంభించిన రాకపోకలు..
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తి-వసంత గ్రామాలకు వెళ్లే రహదారిలో వరద నీరు పోటెత్తడం వల్ల రాకపోకలు స్తంభించిపోయాయి. సాలూరు మండలంలో గోముఖి, సువర్ణముఖి, వేగావతి నదుల ఉదృతి కారణంగా...అనేక గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొత్తవలస-సబ్బవరం మార్గంలో గవరపాలెం వద్ద గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల..రాకపోకలు నిలిచిపోయాయి. గెడ్డకి అనుకుని ఉన్న నివాసాలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో పునరావాస కేంద్రానికి తరలించారు. తోటపల్లి, ఆండ్ర, వట్టిగడ్డ జలాశయాలకు వరదనీటి ప్రవాహం పెరిగింది. జిల్లావ్యాప్తంగా అనేక విద్యుత్ సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్య తలెత్తాయి. భోగాపురం మండలం చేపల కంచేరు, ముంజెరు, పూసపాటిరేగ మండలం కొనాడ రహదారిపై చెట్లు పడిపోయాయి. నెల్లిమర్ల రైల్వేస్టేషన్ ప్రధాన రహదారిలో చెట్లు కూలిపోవటం వల్ల...విజయనగరం - పాలకొండ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవలసలో రైల్వే అండర్ బ్రిడ్జి నీట మునగడంతో...అరకు-విశాఖ, సబ్బవరం, కోటపాడు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్.కోట సమీపంలో కొత్తవలస-కిరండోలు మార్గంలో రైల్వ్‌ట్రాక్ కొంతమేర దెబ్బతింది. జిల్లాలో తుపాను కారణంగా ముగ్గురు చనిపోయారు. నువ్వు పంట అరబెట్టే బుట్టలను తీసుకొచ్చే ప్రయత్నంలో గుర్ల మండలం కోటగండ్రేడులో చెరువులో పడి...శీను అనే వ్యక్తి మరణించారు. బొండపల్లి మండలం తమాటాడలో గోడ కూలడంతో సుంకరి సూరమ్మ తీవ్రంగా గాయపడగా...విశాఖకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. ఇదే మండలం వెదురువాడ పంచాయతీ గదబపేటకు చెందిన పిల్లి బుదరయ్య బొప్పాయి చెట్టు పడి మృతి చెందారు.
తుపాను తీరం దాటాక భారీ వర్షం కురవడం వల్ల...ఉక్కు నగరం విశాఖ తడిసిముద్దైంది. గాజువాకలో కుండపోత వర్షానికి పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. గణేష్‌నగర్ కొండ వాలు ప్రాంతంలో చెట్లు విరిగిపడ్డాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ను వర్షపు నీరు చుట్టుముట్టింది. శ్రీహరిపురం, పెదగంట్యాడ, పాత గాజువాక, హౌసింగ్ బోర్డ్ కాలనీ, డ్రైవర్ కాలనీ, బర్మా కాలనీల్లోకి నీరు చేరింది. సామాన్లన్నీ నీటిలో తడిచి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హిందూస్తాన్ షిప్‌యార్డు ప్రాంగణంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. పంచింగ్ యంత్రాలు తడిచిపోయాయి. గంగవరం పోర్ట్‌లో కాలనీలోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి. అండర్‌పాస్ రైల్వే బ్రిడ్జి వద్ద నడుము లోతు నీళ్లు చేరాయి. కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వెళ్లే ఫ్లైఓవర్ మూసివేశారు. వన్‌టౌన్‌కు వెళ్లే మార్గం పూర్తిగా నీటమునిగింది. శిథిలావస్థకు చేరుకున్న జిల్లా ట్రెజరీ కార్యాలయం పైకప్పు నుంచి నీరు కారుతోంది. కంప్యూటర్లు, ఇతర వస్తువులు తడవకుండా కవర్లు కప్పేయటంతో..ఉద్యోగులు పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. విశాఖ విమానాశ్రయంలోకి వర్షం నీరు చేరింది. కార్లు, ద్విచక్ర వాహనదారులు వాన నీటినిలోనే రావాల్సి వచ్చింది. విశాఖ రైల్వేస్టేషన్ పరిసరాలన్నీ పూర్తిగా నీటితో నిండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. పెందుర్తి మండలం నాయుడుతోట అప్పల నరసయ్య కాలనీకి చెందిన తులసి భావన అనే మహిళ కొండరాళ్లు పడి మృతి చెందింది.
ఉభయగోదావరి జిల్లాల్లోనూ...
తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. టి. నరసాపురం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, బుట్టాయగూడెం..మండలాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. కొండవాగులు పొంగి జిల్లాలోని ఏజన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వాగుల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద తాడిపూడి కాలువకు రెండు చోట్ల గండ్లు పడింది. నారాయణపురంలోని వైఎస్సార్ కాలనీ, ఉన్నత పాఠశాల సమీపంలోని ఎస్సీ కాలనీ, కైకరంలోని..బీసీ కాలనీ నీటమునిగాయి. చింతలపూడి లింగపాలెం, కామవరపుకోట మండలాల్లో రోడ్లు, లోతట్టుప్రాంతాలు..జలమయం అయ్యాయి. వరద పోటెత్తడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ జలాశయం నాలుగు గేట్లు,..తమ్మిలేరు జలాశయం 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. గులాబ్ తుపాను ధాటికి తూర్పుగోదావరి జిల్లా...కాకినాడ తడిసి ముద్దయింది. రామకృష్ణారావు పేట సాంబమూర్తినగర్, పర్లోవపేట, శాంతినగర్, సినిమారోడ్డు తదితర ప్రాంతాల్లో నీరు నిలిచింది. మన్యంలో వాగులు ఉధృతంగా...ప్రవహిస్తున్నాయి. విశాఖ జిల్లాలోని తాండవ జలాశయం నుంచి విడుదల చేస్తున్న నీరు..తూర్పు గోదావరి జిల్లా కోటనందురు వంతెనపై ప్రవహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా వై. రామవరం మండలం చిలకలవీధి లంక గ్రామానికి చెందిన నిండు గర్భిణిని స్థానికులు స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు.
పొంగిన వాగులు.. రాకపోకలకు ఇబ్బందులు
కృష్ణా జిల్లాలోని వాగు,వంకలు ఉద్ధృతంగా ప్రవహిస‌్తున్నాయి. మధిర-వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వీరులపాడులో...వర్షానికి కోతులు ఇంటి బల్లపై తలదాచుకున్నాయి . గన్నవరం మండలం తెంపల్లిలో రోడ్లపై మోకాళ్ల లోతు చేరగా అధికారులు ఆయిల్ ఇంజిన్లతో తోడారు. బాపులపాడు మండలం బండారుగూడెంలో...సచివాలయ భవనం జలమయమైంది. కంచికచర్ల బైపాస్‌లో రోడ్డుపై నీళ్లు నిలిచి కారు అదుపుతప్పి బోల్తాపడింది. జోరువానకు విజయవాడ శివారులోని..నున్న పోలీస్ స్టేషన్లో నీరు చేరింది . రామవరప్పాడు, పాయకాపురం, ప్రసాదంపాడు ప్రధాన రహదారుల్లో... 2అడుగుల మేర వర్షపు నీరు ప్రవహించి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది . చిట్టినగర్ సొరంగ మార్గం సమీపంలో కొండ చరియలు విరిగి పడి రెండు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అజిత్ సింగ్ నగర్, డాబాకొట్లు రోడ్, ఎక్సల్ ఫ్యాక్టరీ రోడ్లలో నీళ్లు నిలిచి..వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా ప్రకాశ్‌నగర్, లాల్‌బహుదూర్ కాలనీల్లో కాలువలు పొంగి లోతట్టు ఇళ‌్లను...ముంచెత్తాయి. ఓ టీవీ మెకానిక్ ఇంటికి మరమ్మతులకు వచ్చిన టీవీలు. నీళ్లలో కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లలో సామగ్రి నీటిపై తేలియాడుతున్నాయి. గ్యాస్ స్టౌ మంచం మీద పెట్టి వంట చేసుకున్న దృశ్యాలు కనిపించాయి.
గుంటూరు జిల్లాపై గులాబ్ తుఫాను ప్రభావం చూపించింది. అమరావతిలో అత్యధికగా...42 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తీరప్రాంతం రేపల్లె నియోజకవర్గంలో..తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. సముద్రంలో అలల ఎగసి పడుతుండటంతో...మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి.
ఇదీ చదవండి