Gandhi Temple in Srikakulam: ప్రపంచానికి సత్యం.. అహింస.. శాంతి అనే ఆయుధాలను అందించిన మన జాతిపిత మహాత్మ గాంధీ మందిరం రాష్ట్రంలోనూ ఏర్పాటైంది. బాపూజీతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను చాటేలా స్ఫూర్తి వన నిర్మాణానికి సిక్కోలు నెలవైంది. ఇవాళ గాంధీ వర్ధంతి సందర్భంగా.. మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.
స్వాతంత్య్ర ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన జిల్లాలో.. శ్రీకాకుళానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎంతోమంది వీరులను అందించిన పురిటి గడ్డగానూ గుర్తింపు పొందింది. మహాత్మాగాంధీ లాంటి మహనీయులు ఈ ప్రాంతంలో అడుగు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆమదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్‌లో గాంధీ సభను నిర్వహించారు. మహాత్ముని ఆశయ సాధనకు ప్రతీకగా.. శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ స్మారక మందిరం నిర్మించారు. గాంధీ స్మారక నిధి, గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా.. నగరపాలక సంస్థ పార్క్‌లో గాంధీ ధ్యాన మందిరం తీర్చిదిద్దారు.
ఇదీ చదవండి : ఆంగ్లేయుల అకృత్యాలను ఎదిరించి.. స్వాతంత్య్రం చూడకుండానే!
సర్వమత సమ్మేళనం ఆశయానికి ఆదర్శంగా నిలిచేలా.. 10 అడుగులు ఎత్తులో గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. గర్భగుడిలో ధ్యానముద్రలో ఉన్న మహాత్ముని ప్రతిమ దర్శనమిస్తుంది. ఉద్యమ స్ఫూర్తి చాటేలా మందిరంలో గోడలపై..మహనీయుల సూక్తులతోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, సంఘసంస్కర్తల విగ్రహాలు ఏర్పాటు చేశారు. మందిరానికి రెండు వైపులా అశోక చక్రాలు, నాలుగు సింహాలతో పాటు వందేమాతరం చిహ్నం.. స్వదేశీ చేనేత వస్త్రదారణ చిత్రాలు ఆకట్టుకుంటాయి. వీటన్నిటితోపాటు స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 75 ఏళ్ల ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు.
" మహాత్మా గాంధీ తత్వాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలో గాంధీజీ విగ్రహాలు ఏర్పాటు చేశాం. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాతో గాంధీజీకున్న అనుబంధాన్ని భవిష్యత్ తరాల వారికి తెలియాలని భావించి ఆంధ్రరాష్ట్రంలోనే తొలిసారిగా గాంధీ ధ్యానమందిరాన్ని నిర్మించాం. గాంధీజీ ఆశయాలను భావి తరాలకు అందించడమే మా లక్ష్యం." - ప్రసాదరావు, గాంధీ స్మారక నిధి కమిటీ సభ్యుడు.
"సుమారు 25లక్షల రూపాయలతో గాంధీజీ మందిరాన్ని నిర్మించాము. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇదే ప్రాంగణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద,అంబేడ్కర్ వంటి మహనీయులతో పాటుగా సుమారు 28మంది మహానుభావుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నాం. పిల్లలకు,పెద్దలకు వారి గురించి తెలిసేలా ఏర్పాట్లు చేయనున్నాం. రాబోయే కాలంలో గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం." -మోహన్, గాంధీ మందిరం నిర్వాహక సభ్యుడు
ఇవాళ గాంధీ వర్ధంతి సందర్భంగా..మహాత్ముని మందిరంతోపాటు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి వనాన్ని ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి : బోస్ బాటను మళ్లించిన ఆ కాలేజీ గలాటా- ఐసీఎస్‌ను వదిలి..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!