శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం వెలగవాడ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏటా ఒకసారి కాకుండా ప్రతిరోజూ దేశభక్తుల త్యాగాలు గుర్తువచ్చేలా ఏర్పాటు చేశారు. సాధారణంగా గుడిపైన దేవతా విగ్రహాలు ఉంటాయి. అయితే ఆ గ్రామంలో రామలింగేశ్వర ఆలయంపైన సమరయోధుల విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు. దేవుడితోపాటు వారిని పూజించుకుంటూ అసలైన దేశభక్తిని చాటుకుంటున్నారు.
వెలగవాడలో 6 దశాబ్దాల కిందట రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. విరాళాలతో ఆ గుడిని కట్టారు. నిర్మాణ సమయంలో అన్ని ఆలయాల్లోగే పైన దేవతా విగ్రహాలు పెట్టాలనుకున్నారు. అయితే దేశభక్తి మెండుగా ఉన్న కొందరు గ్రామస్థులు స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు పెట్టాలని గ్రామపెద్దలకు సూచించారు. ఆ ప్రకారమే మహాత్మాగాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ప్రతిష్ఠించారు. గుడికి వెళ్లినవారు దేవునితోపాటు వారినీ పూజిస్తారు. దండం పెట్టుకుని వారి త్యాగాలను స్మరించుకుంటారు. అలా రోజూ దేశభక్తులను గుర్తుచేసుకుంటూ అసలైన దేశభక్తిని చాటుతున్నారు ఆ గ్రామస్థులు.
ఇవీ చదవండి..