FARMERS ACCEPTANCE TO BHAVANAPADU PORT : భావనపాడు పోర్టు భూసేకరణకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల రైతులు అంగీకారం తెలిపారు. ఇప్పటివరకూ భూ పరిహారం విషయంలో నెలకొన్న పంచాయితీకి ఎట్టకేలకు తెరపడింది. ఎకరాకు రూ.25 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అధికారులు ఈరోజు సాయంత్రం రైతులతో సమావేశమయ్యారు. చర్చోపచర్చల తర్వాత రెవెన్యూ మంత్రి ధర్మాన ఎకరాకు రూ.25 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. పోర్టు భూసేకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని మంత్రులు, అధికారులు స్పష్టం చేశారు. అనంతరం కొందరు రైతులను సన్మానించారు.
ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తామని గత ఆదివారం మూలపేట గ్రామంలో సమావేశం నిర్వహించిన అధికారులు ప్రకటించగా.. అందుకు రైతులు ససేమిరా అన్నారు. 45 నిమిషాల పాటు మంత్రులు, అధికారులు వేచి చూసినా రైతులు ముందుకు రాలేదు. ఎకరా భూమికి రూ.25-30 లక్షల మధ్యలో పరిహారం కావాలని రైతులంతా డిమాండ్ చేశారు. ఈ పరిణామాల అనంతరం ఓ మెట్టు దిగొచ్చిన ప్రభుత్వం.. రైతుల డిమాండ్ ప్రకారం ఎకరాకు రూ.25 లక్షలు ఇవ్వడానికి అంగీకరించింది.
ఇవీ చదవండి: