ప్రేమకు అంతే ఉండదు. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు అయిన పరిచయం ఇష్టంగా మారి ప్రేమకు దారితీసే సందర్భాలు ఎన్నో చూస్తూనే ఉంటాం. ఈక్రమంలో చాలామంది ప్రేమించిన తర్వాత పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకుంటుంటారు. మొదట్లో ఒకరి అభిప్రాయాలను మరొకరు ఆమోదించినా.. తర్వాత కొంతమందిలో అవే ప్రతిబంధకాలుగా మారుతుంటాయి. ఆ తర్వాత ‘బ్రేకప్’ చెప్పడానికి వారికి ఎంతో సమయం కూడా పట్టదు. ఈ రోజుల్లో ఇలాంటి ధోరణి చాలామందిలో కనిపిస్తుంటుంది. అయితే బ్రేకప్ తర్వాత కొంతమంది అనుకోకుండా మళ్లీ మాజీని కలిసే సందర్భాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్ని విషయాలు వారితో మాట్లాడకూడదంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందామా...
గతాన్ని తవ్వద్దు.. బ్రేకప్ అయిన వ్యక్తి తారసపడితే కొంతమంది వారిపై ఉన్న కోపాన్ని చూపడానికి ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల తాత్కాలిక ఆనందం లభించినా తర్వాత మరోసారి చింతించాల్సి రావచ్చు. మీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలపై మీకు స్పష్టమైన అవగాహన ఉండే ఉంటుంది. కాబట్టి, మరోసారి తిరిగి గతాన్ని తవ్వుకుని మూడ్‌ని చెడగొట్టుకోవద్దు.
సాగదీత వద్దు.. అనుబంధంలో బీటలు వచ్చాయంటే దానికి రకరకాల కారణాలు ఉండి ఉంటాయి. అయితే దాని తాలూకు జ్ఞాపకాలు కొంతమందిని వెంటాడుతూనే ఉంటాయి. ఈ క్రమంలో తమ మాజీపై మరికొన్ని ప్రశ్నలు మదిలో నిండిపోతాయి. అయితే అనుకోకుండా వారు కలిసినప్పుడు కొంతమంది ఆ ప్రశ్నలను వారిపై సంధిస్తూ మరోసారి చర్చలు పెడుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. సాధ్యమైనంత వరకు క్లుప్తంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడండి. అంతేకానీ, పాత విషయాలను ముందుపెట్టి సాగదీయద్దు.
ఎత్తిపొడుపులు వద్దు.. చాలా సందర్భాల్లో రిలేషిన్షిప్ బ్రేకప్ కావడానికి అభిప్రాయభేదాలే కారణమవుతుంటాయి. అయితే బ్రేకప్ అయిన వ్యక్తి తారసపడినప్పుడు కొంతమంది వారిని నేరుగా విమర్శించకుండా నలుగురిలో ఎత్తిపొడుపు మాటలతో ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో తోటివారికి ఆ విషయాలు సరిగా అర్థంకాకపోయినా మాజీని నొప్పిస్తుంటాయి. దీనివల్ల మీపై ద్వేషం పెరుగుతుంది తప్ప మీకు ఎటువంటి లాభం జరగదు.
జ్ఞాపకాలను గుర్తు చేయద్దు.. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. చాలామంది బ్రేకప్ తర్వాత వాటిని చెరిపేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి, ఆ వ్యక్తి మళ్లీ మీకు ఎదురుపడినప్పుడు వాటిని గుర్తు చేయద్దంటున్నారు నిపుణులు. దీనివల్ల మీరు వారిని మళ్లీ ఇష్టపడుతున్నారనే భావన వారిలో కలిగే అవకాశం ఉంటుంది. ఇది మరోసారి గొడవలకు దారితీసే అవకాశం లేకపోలేదు. కాబట్టి, పాత జ్ఞాపకాలను గుర్తు చేయకపోవడమే మంచిది.
ఇవీ చదవండి :