శ్రీకాకుళం జిల్లాపై గులాబ్ ప్రభావంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పాలకొండలో అంపిలి, అన్నవరం గ్రామాలకు వరద నీరు తాకింది. బూర్జ మండలంలోని అల్లేన, కిలంతర, వైపర్త గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో చెరకు, వరి పంట పొలాల్లో నీరు చేరుకుంది. భీమవరం వాసి ఎన్ని రమణ మృతిచెందగా..మృతదేహాన్ని స్వస్థలం అల్లేనకు అంబులెన్సులో తీసుకువస్తుండగా వరద తాకిడికి ఆగిపోవాల్సి వచ్చింది. ఫోను ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్థులు ట్రాక్టర్ ద్వారా తరలించారు.
పొంగుతున్న నాగావళి, వంశధార నదులు..
జిల్లాలో నాగావళి, వంశధార నదులు జోరుగా పారుతున్నాయి. నదుల పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సూచించారు. నాగావళి నది జోరుకు పాలకొండ, బూర్జ మండలాల్లోని పంటపొలాలు నీటిలో చిక్కుకున్నాయి.
నాగావళి పరివాహక ప్రాంతంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. సోమవారం నాటికి నదిలో 60 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నదికి వరద కారణంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని గోపాలపురం, అన్నవరం, అంపిలీ, తంపటపలి, బీపీ రాజుపేట, వసూల్ పెద్ద ప్రాంతాల్లో పంటభూములు నీట మునిగాయి. పాలకొల్లు నియోజకవర్గంలో సుమారు వెయ్యి ఎకరాల వరకు ముంపునకు గురి అయిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
నీట మునిగిన పంటలు...
గులాబ్ తుపాన్ కారణంగా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు పంట పొలాల్లోకి చేరింది. రాజాం నియోజవర్గంలో రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లోని వందలాది ఎకరాలు నీట మునిగాయి. వరి, చెరకు తదితర పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మడ్డువలస ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లోని పొలాలు పూర్తిగా నీట మునిగాయి. తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు..
ఆమదాలవలస నియోజకవర్గంలో వరితో పాటు చెరకు, మొక్కజొన్న, బొప్పాయి పంటలు సుమారు 15 వేల ఎకరాల వరకు ముంపునకు గురయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పంట పొలాల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో నదులను తలపిస్తున్నాయి.
ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు...
ఆమదాలవలస మండలం ఎన్టీ వాడ గ్రామంలో నాగావళి నది ఒడ్డున నిర్మల చేపట్టిన రైతు భరోసా కేంద్రం, సచివాలయం, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలతో పాటు జగనన్న ఇళ్ల స్థలాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మండల అధికారులు ముంపు గ్రామాలు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Rains Effect: పొంగిపొర్లుతున్న మహేంద్రతనయ నది.. సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు