జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని వైకాపా జిల్లాలో కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎన్నికల బరిలో నిలవాలనుకునే ఆశావహులతో మాట్లాడాలన్నారు. అందరికీ పదవులు రావని, అలాంటి వారుంటే బుజ్జగించాలని చెప్పారు. ఎన్నికల్లో పోటీకి మొగ్గుచూపుతూ...మన మాట విని వెనక్కి తగ్గిన వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యకర్తల భాగస్వామ్యం కావాలని దిశానిర్దేశం చేశారు.
అనంతరం మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ చాలా చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని పేర్కొన్నారు. పలెల్లో గ్రామాభివృద్ధి కమిటీలు, పెద్దలతో చర్చించి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఓ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వైకాపా గెలవడం పెద్ద సమస్యేమీ కాదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో 95 శాతం పంచాయతీలను గెలిచి ముఖ్యంత్రికి బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రెడ్డి శాంతి, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: