శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఉపముఖ్యమంత్రి హోదా కల్పించే అవకాశాలున్నట్లు వైకాపాలో చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మరో మంత్రి మోపిదేవి వెంకట రమణరావు రాజ్యసభకు ఎన్నికైన క్రమంలో వారిద్దరూ ఈ నెల 29న మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. బోస్ రాజీనామాతో ఖాళీ అయ్యే ఉపముఖ్యమంత్రి పదవిని మరో బీసీ వ్యక్తికే ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఇందులో భాగంగానే మొదటి నుంచీ పార్టీతో ఉన్న ధర్మాన కృష్ణదాస్ పేరు పరిశీలనలోకి వచ్చిందంటున్నారు. అయితే పక్కనే ఉన్న విజయనగరంలో జిల్లా నుంచి పుష్పశ్రీవాణి ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. పక్కపక్క జిల్లాల్లో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం సాధ్యమేనా అని చర్చకు వచ్చినా… సామాజికి సమీకరణాల దృష్ట్యా ధర్మాన పేరునే పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మోపిదేవి, బోస్ స్థానంలో కొత్త మంత్రుల ఎంపిక తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. మరోవైపు కొత్తగా మంత్రి పదవులు దక్కించుకునే ఆ ఇద్దరు ఎవరనే దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మాత్రం దీనిపై పార్టీలో ఇంకా ఎవరితోనూ చర్చించలేదని తెలిసింది. మోపిదేవి, బోస్ రాజీనామా తర్వాతే కొత్తవారి పేర్లు ఖరారయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చదవండి : 80 శాతం మునిగిపోయిన పొబిటోరా అభయారణ్యం