శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు అయిన వంశధార నదికి ఆనుకొని పలు ఓపెన్ హెడ్ కాలువల దిగువన ఉన్న ఆయకట్టుకు ప్రస్తుతం సాగునీటి సమస్య వెంటాడుతోంది. ముఖ్యంగా మబగాం ఓపెన్ హెడ్ కాలువ పరిధిలో 10వేల పైచిలుకు ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి అనుసంధానంగా ఆర్. దేవాది, ఉర్లాం తదితర కాలువల నుంచి పోతయ్యవలస, గోపాలపెంట, దేవాది, మడపాం గ్రామాలకు సాగునీరు సరఫరా కావాల్సి ఉంది . అయితే వంశధార నదిలో 10వేల క్యూసెక్కుల నీరు పైబడి నిర్వహిస్తేనే ఓపెన్ హెడ్ కాలువలోకి నీరు చేరుతుంది. అప్పుడే ఓపెన్ హెడ్‌కు అనుసంధానంగా ఉన్న ఇతర కాలువలకు నీరు అందుతుంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
మడపాం గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. గత ప్రభుత్వం ఈ పథకానికి పచ్చజెండా ఊపింది. అయితే వైకాపా ప్రభుత్వం వచ్చాక దీన్ని రద్దు చేసింది. దీంతో సాగునీరు సమస్య అలానే కొనసాగుతోంది. నెలరోజుల క్రితం కురిసిన వర్షాలతో రైతులు వరినాట్లు వేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నా.. అక్కడ వానలు కురవడం లేదు. అటు వానలు లేక, ఇటు కాలువల ద్వారా సాగునీరు లేక వరి ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు.
ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నిర్వహించిన నియోజకవర్గ సమీక్షలో సాగునీటి సమస్య ప్రస్తావనకు వచ్చింది. యుద్ధ ప్రాతిపదికన ఆయా గ్రామాలకు నీరు ఇవ్వాలని మంత్రి కృష్ణదాస్ ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. ఒకటి రెండు రోజుల్లో అల్పపీడన ప్రభావంతో అయినా వర్షాలు పడితే పైరు ఊపిరి పీల్చుకుంటుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి..