contractor locked school toilets: నాడు నేడు పథకానికి ప్రభుత్వ నిధులు కేటాయించకపోవడంతో శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా గుత్తేదారు పాఠశాల మరుగుదొడ్లకు తాళం వేశారు. ఈ నేపథ్యంలో మరుగుదొడ్లు లేక విద్యార్థులతో పాటుగా మహిళా ఉపాధ్యాయులు సైతం ఆరుబయటకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నాడు నేడు మొదటి విడతలో భాగంగా 1.38 కోట్లు నిధులు కేటాయించారు. ఆ పనులను నాబార్డ్ గుత్తేదారులకు ఇచ్చారు. అప్పటివరకు శిథిలావస్థలో ఉన్న పాఠశాల పాత మరుగుదొడ్లను ధ్వంసం చేసి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ... నూతన మరుగుదొడ్లు నిర్మించ లేదు. దింతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉపాధ్యాయుల కోసం ఉన్న ప్రత్యేక మరుగుదొడ్లను 2018 లో నిర్మించినా... వాటికి కూడా ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లింపలేని కారణంగా గుత్తేదారు వాటికి తాళం వేశారు.
జి. సిగడాంతో పాటు చుట్టుపక్కల 16 గ్రామాల నుంచి ఈ పాఠశాలలో 420 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 160 మంది బాలికలు ఉన్నా బాలికల కోసం ప్రత్యేకంగా కనీసం సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. బాలురుతో పాటు బాలికలు సైతం మరుగుదొడ్ల కోసం ఆరుబయట కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు బయట మరుగుదొడ్లు వినియోగించడం వలన బాలికలకు పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయంటున్నారు. వెంటనే విద్యాశాఖాధికారులు, ప్రభుత్వం కల్పించుకొని మరుగుదొడ్లు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఈ పాఠశాలలో మరుగుదొడ్ల తో పాటు తరగతి గదులో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఉపాధ్యాయులే అరకొర నిధులతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నెట్టుకు వస్తున్నారు. రానున్న పదవ తరగతి పరీక్షలు నేపథ్యంలో మౌలిక వసతులు లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందంటున్నారు. మరుగుదొడ్లు మౌలిక వసతులు లేని కారణంగా పాఠశాలలో చేరే బాలికల సంఘ తగ్గుముఖం పడుతుందని తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయులు చెబుతున్నారు.
'విద్యార్థులకు రూంలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కట్టిన మరుగుదొడ్లను ప్రభుత్వం బిల్లు చెల్లించకపోయినా.. మా విజ్ఞప్తిమేర కాంట్రాక్టర్ వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. గత రెండు సంవత్సరాలు అయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో రెండు నెలల కింద మరుగుదొడ్లకు తాళం వేశారు. బిల్లులు రాకపోవడం వల్లే తాళం వేస్తున్నట్లు కాంట్రక్టర్ తెలిపారు. మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. బాలికలు ఈ పాఠశాలనుంచి విద్యార్థులు వేరే పాఠశాలలకు వెళ్తున్నారు. అధికారలు స్పందించి చర్యలు తీసుకోవాలి.'- పీవీ నరసింహామూర్తి ప్రధానోపాధ్యాయులు
ఇవీ చదవండి: