తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి ఏలా సాధించాలి అనే అంశాలపై ప్రతి రైతుకు అవగాహన కల్పించి.. వారి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ అన్నారు. ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు నిర్వహించిన కిసాన్ మేళ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అవలంబించే విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలని కోరారు.
అంతర్గత పంటలు, పంటల మార్పిడి విధానాన్ని తెలియజేస్తే రైతులు వ్యవసాయ రంగంలో లాభసాటిగా ముందుకు సాగుతారని... ముఖ్యంగా సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతలకు అవగాహన కల్పించి ఆ దిశలో పంట పండించే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో రానున్న ఖరీఫ్ సీజన్‌కు చిన్న, సన్నకారు రైతులకు పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువులు అందే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది'