Bridge Collapsed in Srikakulam: దశాబ్ద కాలంగా అనుకుంటున్నదే జరిగింది. వందేళ్ల చరిత్ర కలిగిన బహుదా నదిపై ఆంగ్లేయులు నిర్మించిన వంతెన కుప్పకూలింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వంతెనకు అధికారులు కొన్నేళ్లుగా మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. ఇవాళ భారీ లారీ వెళ్తుండగా వంతెన కూలిపోయింది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బ్రిటిష్ కాలం నాటి వంతెన కుప్పకూలింది. ఉదయం ఆరు గంటల సమయంలో భారీ గ్రానైట్ లోడుతో వాహనం వంతెనపై నుంచి వెళ్తుండగా.. ఆ బరువును తట్టుకోలేక వంతెన కూలిపోయింది. సుమారు 30 మీటర్ల మేరకు వంతెన కూలింది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
బహుదా నదిపై వంతెనను 1929లో నిర్మించారు. ఈ వంతెన బాగా శిథిలమైనప్పటికీ కొన్ని దశాబ్దాలుగా అధికారులు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. వంతెన బాగా బలహీనంగా ఉండి.. వాహనాలు వెళ్తున్నప్పుడు ఊగుతూ ఉంటుంది. అయినా అధికారులు మరమ్మతులకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ వంతెనను తొలగించి కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని 20 ఏళ్లుగా ఇచ్ఛాపురం వాసులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ అధికారులు పట్టించుకోలేదు.
అయితే వంతెన కూలడానికి మరో ప్రధాన కారణం బహుదా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలనేనని స్థానికులు చెబుతున్నారు. వంతెన పిల్లర్స్ వద్ద ఇసుకను తవ్వడం వల్ల పిల్లర్లు బాగా బలహీనపడినట్లు చెబుతున్నారు. నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. ఆ నిర్లక్ష్య ఫలితమే వంతెన కూలిపోవడానికి కారణమైందని అంటున్నారు.
బహుదా నదిపై వంతెన కూలడంతో.. ఇచ్ఛాపురం, పలాస మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇచ్ఛాపురంలో స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో.. భారీ వాహనాలు రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ.. 70 టన్నుల భారీ గ్రానైట్‌తో వెళ్తున్న వాహనం వంతెన వరకు ఎలా వచ్చిందో తెలియడం లేదు. వంతెన కూలడంతో ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జాతీయ రహదారిపై నిర్మించిన నూతన వంతెన ద్వారా మాత్రమే ఇచ్ఛాపురానికి వాహనాలను అనుమతించాలని అధికారులు యోచిస్తున్నారు.
ఇవీ చదవండి: