మాతృభాష ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవాలని శాసనమండలి, తెలుగు భాషా, సంస్కృతి కమిటీ ఛైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కమిటీ... కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించింది. మాతృ భాష గొప్పదనాన్ని కొనియాడిన ఛైర్మన్..తెలుగు భాషా, సంస్కృతిని పరిరక్షించుకోవాలన్నారు. మాతృభాషలో తీపిదనాన్ని, ఔన్నత్యాన్ని, మధురత్వాన్ని మరచిపోరాదన్నారు. పూర్వకాలం నుండి తెలుగు భాషకు వైభవం ఉందని.. తాళపత్ర గ్రంథాలలో సైతం ఎంతో అమూల్యమైన భాషా సాంస్కృతిక సంపద నిక్షిప్తమై ఉందన్నారు.
తంజావూరులో 2 వేల 300 తెలుగు తాళపత్ర గ్రంథాలున్నాయన్న ఛైర్మన్..తాళపత్ర గ్రంథాలను ప్రస్తుత అక్షర రూపంలోకి మార్చుతూ డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. వివిధ సంస్థలు గ్రంథాలయాలకు చెల్లించాల్సిన సెస్సులను చెల్లించి భాషాభివృద్ధికి సహకరించాలని కోరారు.