APTF: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) 75వ వార్షికోత్సవం, 19వ రాష్ట్ర విద్య వైజ్ఞానిక మహాసభలు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలిరోజు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరయ్యారు. మధ్యాహ్నం నగరంలో ర్యాలీ నిర్వహించేందుకు బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకుండా తాత్సారం చేయడం తగదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొప్పల భానుమూర్తి, పి.పాండురంగ వరప్రసాదరావు అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని డిమాండు చేశారు. కేంద్రం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యావిధానాన్ని, రాష్ట్రంలో అమలు చేస్తున్న 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. కొఠారి కమిషన్ సూచించిన మేరకు కామన్ విద్యావిధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ హెచ్చరించారు. సమావేశంలో ఉపాధ్యాయ మాసపత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలానీ, ఉపాధ్యాయ దర్శిని పుస్తక ప్రధాన సంపాదకులు కె.వేణుగోపాల్, ఏపీటీఎఫ్ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు కె.రమణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు... అనిల్, కాకాణి మధ్య విభేదాలకు కారణాలేంటి?