Governor Biswa Bhushan Harichandan words: మన భారతదేశం పాశ్చాత్య దేశాలైన.. అరబిక్, యూరోపియన్ తదితర దేశాలతో వ్యాపార రంగంలో సమానంగా అభివృద్ధి వైపు స్థిరంగా ముందుకు సాగడం శుభ పరిణామమని.. అభివృద్ధి చెందిన దేశాలకు మన దేశం గమ్య స్థానంగా నిలుస్తోందని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరమ్ జాతీయ బిజినెస్ ఎక్సలెన్స్ 2023, అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
అనంతరం గవర్నర్ విశ్వ భూషణ్ ప్రసంగిస్తూ.. దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, స్వావలంబనగా మార్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. 'మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా' వంటి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా మోదీ ఆత్మ నిర్భర భారత్ దార్శనికతను సాకారం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వారికి మద్దతుగా వివిధ పథకాలు, ప్రోత్సాహకాలను అమలు చేస్తోందన్నారు.
దేశంలోనే హస్తకళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలను సాధించిందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని బుడితి నుంచి ప్రత్యేకమైన మెటల్ సామాను, ఇత్తడి, రాయి, చెక్క చెక్కడం, బొబ్బిలి వీణాలు, కొండపల్లి నుండి బొమ్మలు, జానపద పెయింటింగ్, కలంకారి పెయింటింగ్, బ్లాక్ ప్రింటెడ్ వస్త్రాలు, చేనేత పట్టుచీరలు, టేకు, యూకలిప్టస్ వంటి అధిక కలపను ఉత్పత్తి చేస్తుందన్నారు. రాష్ట్రం ముడిపట్టు ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఔత్సహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా వ్యాపార రంగం అభివృద్ధి చెండంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన వారవుతారని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. నేషనల్ బిజినెస్ ఎక్సలెన్స్ 2023, అవార్డులకు ఎంపికైన ప్రతి ఒక్కరిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ రాయబారి అరుణ్ కోమర్ హార్డియన్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా హై కమిషనర్ అహ్మద్ సులే, నేపాల్ రాయబారి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ, రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ హై కమిషనర్ కమలేష్ ప్రకాష్, గ్లోబల్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరమ్, అధ్యక్షులు డా. జితేంద్ర జోషి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి