2nd Day Municipal Workers Strike: కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె రెండోరోజుకు చేరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివిధ ప్రాంతాల్లో పురపాలక సంఘం కార్యాలయాల ఎదుట కార్మికులు నిరసన చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Municipal Workers Strike in Srikakulam: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ శ్రీకాకుళంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏడు రోడ్ల కూడలి వద్ద ధర్నా చేపట్టి, అక్కడ నుంచి నగరపాలక సంస్థ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
Municipal Workers Protest in Anantapur: అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది మోకాళ్లపై నిల్చోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Workers Protest Against Government to Fulfill Demands: నంద్యాలలో మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలని మోకాళ్ళ మీద కూర్చుని నిరసన తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎంప్లాయిస్, వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. 2019లో ఇచ్చిన హామీలు అమలు చేసి, వారాంతపు, పండుగ సెలవులు ఇవ్వాలని నినాదాలు చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం శ్రేణులు సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపాయి. కడప మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం, కార్మికులను పర్మినెంట్ చేస్తామని, ఆదాయంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారని మండిపడ్డారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె నిర్వహించారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మున్సిపల్ కార్మికులు రెండొ రోజు సమ్మెలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని, మోకాళ్ళపై నిలబడి నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి చర్చలు జరిపి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.