అత్యవసర సమయంలో ఆదుకోవాల్సిన 108 వాహనం అందుబాటులోకి రాలేదు. ఫోన్ చేస్తే.. కాసేపట్లో వస్తామన్న వారు అరగంట తర్వాత వాహనాలు అందుబాటులో లేవని సమాధానం చెప్పారు. అంబులెన్స్ కోసం ఎదురుచూసిన ఆ గర్భిణి పురిటి నొప్పులు తాళలేక నరకయాతన అనుభవించింది. నెలలు నిండకుండా ఇంట్లోనే ఆడబిడ్డను ప్రసవించింది. సమయానికి వైద్య సేవలు అందక శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామంలో శిశువు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన విరోధి తులసి ఆరు నెలల గర్భిణి. రెండో కాన్పుకోసం పుట్టింటికి ఇటీవలే వచ్చింది. ఆమెకు ఉన్నట్టుండి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. కాసేపట్లో వస్తామన్న వారు రాకపోవడంతో అరగంట తర్వాత మరోసారి సంప్రదించారు. కొవిడ్ రోగులను తరలించే పనిలో ఉన్నందున అందుబాటులో లేవని సమాధానం వచ్చింది. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు వేరే వాహనాన్ని సమకూర్చుకోలేక 108 కోసం నిరీక్షించారు. గంట తర్వాత ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. అయితే తల్లి గర్భంలోనే ఆ బిడ్డ ప్రాణాలు వదిలింది.
ఆసుపత్రికి తరలించే స్తోమత కూడా లేకపోవడంతో విషయం తెలుసుకున్న.. గ్రామస్థులు చందాలు వేసుకుని వజ్రపుకొత్తూరు మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తులసిని చేర్పించారు. ఆపద కాలంలో 108 ఆదుకోకపోతే.. తమలాంటి నిరుపేదల పరిస్థితి ఏంటని బాధితురాలి తల్లి నారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: 'సచిన్ చేతిలో ఏమీ లేదు.. ఇదంతా భాజపా పనే'