YSRCP Councillor Argument with Locals : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ ప్రాంతంలో నిర్మిస్తున్న వంతెన కారణంగా.. తమ కాలనీ లోతట్టు ప్రాంతం అయిందని ఆరోపిస్తున్నారు. వంతెన సరైన రీతిలో నిర్మాణం చేపట్టడం లేదంటూ.. శ్రీకంఠపురం కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రాంతం లోతట్టు ప్రాంతం అవడం వలన.. ఇళ్లల్లోకి బురద, వర్షం నీరు వస్తున్నాయని.. కాలనీకి రాకపోకలు కొనసాగించేందుకు సర్సీసు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ.. చిన్నా, పెద్దా అంతా కలిసి.. హిందూపురం లేపాక్షి ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ.. నినాదాలు చేశారు.
స్థానిక మహిళతో వైసీపీ కౌన్సిలర్ వాగ్వాదం: ఆందోళన చేస్తున్న స్థానికుల దగ్గరకి వైసీపీకి చెందిన కౌన్సిలర్.. మున్సిపల్ కమిషనర్‌ను వెంటపెట్టుకొని వచ్చారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్.. ఆందోళకారులతో వాగ్వాదం పెట్టుకున్నాడు. సహనం కోల్పోయి మాటల యుద్ధానికి దిగాడు. ఆందోళనకారులపై గట్టిగా అరుస్తూ.. కేకలు వేశాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను డబ్బు అడగడానికి ఫోన్ చేసిన వారు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయలేదు అంటూ చిందులు వేశాడు.
కౌన్సిలర్‌ను ప్రశ్నించిన మహిళ: దీంతో స్థానిక మహిళ.. గొడవ పెట్టుకోవడానికి వచ్చారా లేదంటే సమస్య పరిష్కరించడానికి వచ్చారా అంటూ ప్రశ్నించింది. దానికి సమాధానంగా సదరు కౌన్సిలర్.. సమస్య పరిష్కరించడానికే అని చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ వెంటనే కలుగజేసుకొని.. ఇరువురిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
వివాదం సద్దుమణిగింది ఇలా: తనకు సమస్య ఏంటో తనకు వివరించాలని.. మీరు ఇలా గొడవలు పడితే ఎలా అని వారిని వారించేందుకు మున్సిపల్ కమిషనర్ ప్రయత్నించారు. తర్వాత శ్రీకంఠపురం వాసులకు న్యాయం జరిగేలా చూస్తానని, సర్వీసు రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. అతను హామీ ఇవ్వడంతో.. శ్రీకంఠపురం కాలనీవాసులు శాంతించి.. ఆందోళన విరమించారు.
"ఇక్కడ మాకు రోడ్డు కావాలని ధర్నా చేస్తున్నాం సర్. కానీ ఇక్కడ ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము గంటన్నర నుంచి ధర్నా చేస్తున్నాం.. అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదు. మాది లోతట్టు ప్రాంతం అయిపోయింది. చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు కావాలి, డ్రైనేజీ కావాలి అని చెప్తున్నాం. ఈ వంతెన వేసినప్పుడు ఒకటి చెప్పారు. ఇప్పుడు ఏమో వేరేది చెప్తున్నారు. నీళ్లు మొత్తం ఇళ్లల్లోకి వస్తున్నాయి. దీని నుంచి మాకు న్యాయం చేయాలి. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలి". - శైలజ, స్థానికురాలు
ఇవీ చదవండి: