Dharmavaram Solar Lands: ఏడేళ్లు క్రితం ఎకరా భూమిని మూడున్నర లక్షలకు కొనుగోలు చేసి..ఇపుడు 3 లక్షలకే అమ్మేవారు ఎవరైనా ఉన్నారా అంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా..ఇది ముమ్మాటికీ వాస్తవం. 2015లో ధర్మవరం మండలం గరుడంపల్లిలో దిల్లీకి చెందిన సౌర విద్యుత్ సంస్థ 106 ఎకరాల భూమిని 40 మంది రైతుల నుంచి కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి.. సెక్యూరిటీ సొమ్ము చెల్లించలేని కారణంగా ఆ సంస్థ సోలార్ ప్రాజక్టును.. ఏర్పాటు చేయలేకపోయింది.
ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కన్ను ఈ భూములపై పడింది. సౌర ప్రాజక్టు ఏర్పాటు చేయని కంపెనీ.. యాజమాన్యంపై రెవెన్యూ అధికారుల ద్వారా.. ఒత్తిడి తెచ్చారు. సౌర ప్రాజక్ట్ ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వం వెనక్కుతీసుకునేలా నివేదిక పంపుతున్నట్లు అధికారుల ద్వారా యజమానులను బెదిరించారు. పెట్టుబడి మొత్తం పోతుందని భావించిన సోలార్ సంస్థ యజమానులు భూములు విక్రయించాలని నిర్ణయించారు.
భూమి అమ్మకానికి ఒప్పించిన రెవెన్యూ అధికారి, ఆయనే మధ్యవర్తిగా ఉంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డికి దగ్గరివాడైన నాగరాజు ద్వారా ఎకరా 3లక్షల చొప్పున కొనుగోలు చేయించారు. ఈభూమిని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడు, భార్య భాగస్వాములుగా ఉన్న సూర్య ఆగ్రోఫాం సంస్థకు కొనుగోలు ద్వారా బదిలీ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కుటుంబం ఆ 106 ఎకరాల భూమిని చదును చేస్తోంది. చౌకగా భూములు కొంటే ఎవరికేమి ఇబ్బందని ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశ్నించారు. ప్రైవేట్ భూములు ఎవరైనా అమ్మెుచ్చు..కొనచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించే సౌర విద్యుత్ ప్రాజక్టు భూములను ఎమ్మెల్యే... చౌకగా కొనుగోలు చేశారని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆరోపించారు. హైదరాబాద్-బెంగుళూరు 44 వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసే ప్రధాన రహదారి కొత్తగా నిర్మించనున్నారు. ఈ రహదారి.. కేతిరెడ్డి కారుచౌకగా కొనుగోలు చేసిన భూములనుఆనుకొని వెళ్లనుంది. ప్రస్తుతం ఎకరా 40 లక్షల రూపాయలున్న ఈ భూమి, ఈ ప్రధాన రహదారి నిర్మాణం తర్వాత... ఎకరా కోటి రూపాయల వరకు ధర పలికే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: