శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం మలమీదపల్లి పంచాయతీ కరణంవారిపల్లి గ్రామ వాలంటీర్ హరి.. ఓ వృద్ధుడి బ్యాంకు తాఖా నుంచి నగదు కాజేశాడు. పింఛన్ డబ్బులు పంపిణీ చేసే క్రమంలో.. అదే గ్రామానికి చెందిన రామిరెడ్డి బ్యాంకు ఖాతాలో నగదు ఉన్నట్లు గుర్తించాడు. ఎలాగైనా ఆ సొమ్మును కొట్టేయాలని పథకం వేసిన వాలంటీర్.. సాంకేతికతను వాడుకొని పని కానిచ్చేశాడు! ప్రణాళిక ప్రకారం.. మార్చి 20న హెల్త్ కార్డు కోసమంటూ వృద్ధుడి నుంచి వేలిముద్రలు తీసుకున్న వాలంటీర్.. ఈజీ పే యాప్ ద్వారా రూ.5,500 తన ఖాతాకు మళ్లించుకున్నాడు. ఏప్రిల్ 1న పింఛన్ మొత్తం సొమ్ము చెల్లించాడు. వేలిముద్రలు పడలేదని తరువాత రోజు రామిరెడ్డి నుంచి మరోసారి వేలి ముద్రలు వేయించుకుని మరో రూ.10వేలను కాజేశాడు.
ఈ క్రమంలో ఫోన్‌కు వచ్చిన మెసేజ్ ద్వారా విషయం తెలుసుకున్న బాధితుడు రామిరెడ్డి.. వెంటనే సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సచివాలయ అధికారులు చెప్పడంతో వాలంటీర్ హరి తన తప్పును ఒప్పుకున్నాడు. వృద్ధుడి సొమ్మును తిరిగి ఇచ్చేయడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. అయితే వాలంటీర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకపోవడంతో వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. మోసానికి పాల్పడ్డ వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అధికారులమంటూ వచ్చారు.. ఉంగరాలు దోచుకెళ్లారు..!