Attack on Volunteer: తప్పు చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన.. వాలంటీర్‌పై దాడికి పాల్పడ్డారు. పేద ప్రజలకు అందించే.. రేషన్ బియ్యం తూనికల్లో అవకతవకలను ప్రశ్నించినందుకు వాలంటీర్‌ను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో వాలంటీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఏం జరిగిందంటే..?
సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులో దారుణం చోటుచేసుకుంది.పేదలకు ఇస్తున్న బియ్యం, రాగుల తూకంలో మోసం చేస్తున్న వాహనదారుడుని ప్రశ్నించినందుకు వాలంటీర్‌పై దాడి చేశారు. నలుగురు వ్యక్తులు.. ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి చితకబాదారు.
తీవ్ర గాయాలతో వాలంటీర్ ఇర్ఫాన్ కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో అబ్దుల్ జబ్బర్ అనే బియ్యం రవాణా వాహనదారుడు.. సంబంధిత ప్రాంతంలో పేదలకు బియ్యం, రాగులు పంపిణీ చేస్తున్నారు. బియ్యం తూకం సమయంలో ఒక కేజీ రాయిని పక్కనబెట్టి తూకం వేస్తున్న విషయాన్ని వాలంటీర్ ఇర్ఫాన్ గమనించి ప్రశ్నించాడు.
ఇదే విధంగా రాగుల తూకంలో రెండు కేజీల బరువు ఉండే.. ఇనుప దిమ్మె పెట్టి తూకం వేస్తున్న విషయాన్ని ప్రశ్నించినందుకు జబ్బర్‌తో పాటు నలుగురు సమీప బంధువులు కలిసి వాలంటీర్ ఇర్ఫాన్‌ను చితకబాదారు. తీవ్ర గాయాలకు గురైన ఇర్ఫాన్‌ను హుటాహుటిన కదిరి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. తలపై తీవ్రంగా కొట్టారని వాలంటీర్ తెలిపాడు.
శరీరంపై పలుచోట్ల తీవ్రంగా గాయాలయ్యాయి. వాలంటీర్ షర్ట్ కూడా చిరిగిపోయింది. తూకంలో మోసాన్ని.. వీడియో చిత్రీకరించినందుకు సెల్ ఫోను తీసుకొని.. జేబులో ఉన్న పదివేల రూపాయల నగదును సైతం లాక్కున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తూకంలో మోసం చేస్తున్న బియ్యం రవాణా దారుడు జబ్బర్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
"నేను వాలంటీర్‌గా పనిచేస్తున్నాను. ఈ రోజు జబ్బర్ అనే రైస్ వాహనదారుడు.. రాయి పెట్టేసి 25 కేజీల బియ్యంకి.. ఒక కేజీని వాళ్లు తీసుకుంటున్నారు. ప్రజలు సొమ్ము మీరు ఇలా తీసుకోకూడదు కదా.. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగాను. మాకు బియ్యం తక్కువ వస్తున్నాయి.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నారు. నేను ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేస్తుంటే.. నా సెల్ ఫోన్ తీసుకొని పగలకొట్టేశారు. తరువాత జబ్బర్ అనే వ్యక్తి, అతని కొడుకులు ఇద్దరు.. నాపై దాడి చేశారు. రోడ్డుపై తోసేసి.. తలపై కొట్టారు". - వాలంటీర్, బాధితుడు
"ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రైస్ దగ్గర.. కేజీ రాయి పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం". - స్థానికుడు