People Suffering Due To 8 People Died In a Road Accident : అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తలగాసుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓకే గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందడంతో గ్రామంలో ప్రతి ఇంట కన్నీరుమున్నీరుగా విలపించారు. గార్లదిన్నె మండల సమీపంలో నిన్న(శనివారం)రోజున కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ఓకే గ్రామానికి చెందిన వ్యక్తులు మృతి చెందారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇవాళ పంచనామా నిమిత్తం గ్రామానికి మృతదేహాలను తరలించారు. మృతదేహాల వెంట అధికారులు, పోలీసులు స్వగ్రామానికి వెళ్లారు. మృతుల బంధువులను స్వగ్రామానికి తీసుకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మృతదేహాలను ఒక్కసారిగా అధికారులు గ్రామంలోకి తీసుకురావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా తీవ్ర ఉద్వేగానికి గురైయ్యారు. మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఆటో డ్రైవర్లకు జరిమానాలు : శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్ క్రీడా మైదానంలో ఆటో డ్రైవర్లతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఆటోలో ఎక్కువ మంది ప్రయాణికులను తరలిస్తే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని SI జనార్దన్ నాయుడు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చామని SI చెప్పారు. అధిక లోడుతో వెళ్తున్న ఆటో డ్రైవర్లకు జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు.
కూలీల ఆటోను ఢీకొట్టిన బస్సు - 8 మంది దుర్మరణం - సీఎం దిగ్భ్రాంతి
ప్రభుత్వ పరిహారం : రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందడం బాధాకరమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరమర్శించారు. మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున అందించేలా ప్రభుత్వం పరిహారం ప్రకటించిందన్నారు. మృతి చెందిన కుటుంబంలోని పిల్లల చదువులకు బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి సత్యకుమార్ చెప్పారు.
త్రీ వీలర్ ఆటోలన్నీ బ్యాన్ చేయ్యాలి : రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందడం పట్ల తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. త్రీ వీలర్ ఆటోలన్నీ బ్యాన్ చేయాలని కోరారు.
వంటింట్లోనే ప్రసవం- పండంటి మగబిడ్డకు ఆయువు- తలుపు తెరిచి చూస్తే!