ఉద్యోగుల బదిలీలంటేనే రాజకీయ నేతల సిఫారుసులపై నడుస్తుంటాయి. కానీ సత్యసాయి జిల్లాలో ఓ మైనార్టీ ఉద్యోగిని తనకు వచ్చిన బదిలీ ఉత్తర్వులు అమలు చేయించుకునేందుకు.. రాజకీయం అడ్డొచ్చింది. టైపిస్ట్ కైసర్ బేగం సత్యసాయి జిల్లా పరిగి ఎంపీడీవో కార్యాలయానికి.. బదిలీపై వచ్చారు. బదిలీ కాపీ తీసుకుని ఎంపీడీవో శ్రీలక్ష్మిని కలవగా జాయిన్ చేసుకోలేదు. విధుల్లో చేరాలంటే.. ముందుగా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ సోదరుడు రవీంద్రను కలవాలని ఎంపీడీవో స్పష్టం చేశారు.
రాజకీయాలతో తనకేం సంబంధం అని కైసర్ బేగం వాపోయారు. ఎంపీడీవో ఛాంబర్‌లోనే కన్నీరు పెట్టుకున్నారు. విషయం మీడియాకు తెలియడంతో స్థానిక వైకాపా నాయకులు కొందరు హడావుడిగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి.. కైసర్ బేగం భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కైసర్ బేగం భర్త కూడా వైకాపా కార్యకర్తే అయినప్పటికీ.. ఎమ్మెల్యే సోదరుడు రవీంద్రతో వచ్చిన బేదాభిప్రాయాలతో దూరంగా ఉంటున్నారు. ఇది మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే సోదరుడు.. ఇప్పుడు తన భార్య జాయినింగ్ విషయంలో వేధిస్తున్నారని.. కైసర్ బేగం భర్త మున్నా వాపోయారు. ఈ విషయంపై ఎంపీడీవో శ్రీలక్ష్మిని ప్రశ్నించగా.. తాను ఎంపీపీని మాత్రమే కలవమని చెప్పానని బుకాయించారు.
ఇవీ చూడండి: