Soil Danda: మట్టిదందాతో కొందరు వ్యాపారులు కొండలు, గుట్టలను కొల్లగొట్టి కోట్లు పోగేసుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన మరికొందరు వాటిని చదును చేసుకుని సాగుభూములుగా మార్చేసుకుంటున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా కొండలు తరిగిపోతుండగా వాగులు కనుమరుగవుతున్నాయి.
కొండలే ఆధారం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో మట్టివ్యాపారులు రెచ్చిపోతున్నారు. రేయి, పగలు తేడా లేకుండా కొండలను తొలిచేస్తున్నారు. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ పరిధిలోని కదిరికొండ, సుంకరోనిమొరం, బిల్లికొండలు సుమారు 500 ఎకరాలు విస్తరించి ఉన్నాయి. సుమారు 15 గ్రామాల పశువుల కాపరులకు ఈ కొండలే ఆధారం. రోజురోజుకు అడవులు కరిగిపోతుండటం పశుపోషకులను ఆందోళన కలిగిస్తోంది. వివిధ కారణాలతో ఇప్పటికే ఆవులు, ఎద్దులు సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు ఎక్కవ మందికి జీవనాధారమైన గొర్రెలు, మేకలకు గ్రాసం లేకుండా చేస్తున్నారని, కొండలను తవ్వేస్తున్నారంటూ పశువుల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్‌లో కొండలు కనిపించవు: కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ పరిధిలోనే శ్రీకృష్ణదేవరాయులు కాలంలో నిర్మించిన విఠల్ రాయుని చెరువు ఉంది. ఈ చెరువుకు వర్షపు నీరు వచ్చేందుకు ఆధారమైన వాగులను కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారు. భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు తమ పొలానికి సమీపంలోని వాగులను కబ్జా చేసేస్తున్నారు. వాటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలను అడ్డుకోకపోతే భవిష్యత్‌లో కొండలు కనిపించవు. వాగుల ఆక్రమణ కొనసాగితే చెరువులకు నీరు చేరే అవకాశం లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు.
ఈ కొండల్లో పచ్చగా ఉంటే పశువులను మేపుకుంటాము. రాళ్లు తీసేసి పొలాలుగా చేస్తున్నారు. ఇరువైపులా మట్టి తోలుతున్నారు. పశువులు పొలాల్లోకి వెళితే కొట్లాటకు వస్తారు. కేసులు పెడతామంటారు. గడ్డి మేసేదానికి వీలులేకుండా గుంతలు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద గుంతలు ఏర్పాటు చేశారు. నీళ్లు ఏర్పడి గడ్డి ఉంటే అది తీసేస్తున్నారు. కొండ మీదకు వేళదామనుకుంటే దారి లేకుండా చేశారు. మాకు ఈ గొర్రెలు, మేకలే జీవనాధారం. -గంగయ్య, మిద్దివారిపల్లి
చర్యలు: సర్వే చేయించి, ఎంత వరకు ఆక్రమణలు జరిగాయో తెలుసుకోని చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నటరాజ్ తెలిపారు.
విఠల్ రాయుని చెరువుకు ఆక్రమణలు వచ్చినాయని చెప్పినారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్టు తీసుకోని మండల సర్వేయర్‌ను పంపించి ఎంత మేరకు ఆక్రమణలు ఉన్నాయని తెలుసుకోని చర్యలు తీసుకుంటాము. - నటరాజ్, తహసీల్దార్, కదిరి
ఇవీ చదవండి