YCP anarchists: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీ ప్రజాప్రతినిధి అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. ఇప్పటికే కొండలు, గుట్టలను ఆక్రమించిన ఆ ఘనుడు.. ఇసుక, మట్టినీ వదలకుండా దోచుకుంటున్నారు. తాజాగా.. ఐదు దశాబ్దాలుగా పేదలు నివసిస్తున్న భూమిని ఆక్రమించేందుకు ఆయన.., తన అనుచరులతో కలిసి చేస్తున్న అక్రమం తాజాగా బయటపడింది. సుమారు 50 ఏళ్ల క్రితం ధర్మవరం నుంచి వలస వెళ్లిన ఓ కుటుంబానికి చెందిన విలువైన భూమిని.. తాము కొనుగోలు చేశామంటూ వైసీపీ ప్రజాప్రతినిధి అనుచరులు వసూళ్లకు తెరలేపారు. ధర్మవరం బస్టాండ్‌కు ఎదురుగా దుకాణ సముదాయం వెనుకనే ఉన్న సాయినగర్ కాలనీ విస్తీర్ణం 7.93 ఎకరాలు కాగా.. ఈ భూమంతా మూగి జానకమ్మ వారసులకు చెందినది. గతంలో వీరు రెండు ఎకరాలు విక్రయించగా మిగిలిన 5.93 ఎకరాల భూమి.. మూగి జానకమ్మ పేరిట ఉంది. ఆమె సంతానం దక్షిణామూర్తి, రాధాకృష్ణకు రిజిస్టర్ వీలునామా రాసినట్లుగా తెలుస్తోంది.
జానకమ్మ తదనంతరం నాలుగు తరాలుగా కుటుంబం విస్తరించి.. 40 మంది వరకు వారసులు ఉన్నట్లు సమాచారం. వీరంతా అనంతపురం, కర్నూలు, చెన్నై, బళ్లారిలో స్థిరపడ్డారు. దాదాపు 5 దశాబ్దాల క్రితం ధర్మవరం నుంచి వలస వెళ్లిన జానకమ్మ వారసులు.. ఎప్పుడో ఒకసారి సొంత ఊరికి వచ్చివెళ్లేవారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న 5.93 ఎకరాల భూమిలో.. దాదాపు 160 పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇళ్లు కట్టుకుని స్థిరపడ్డారు. బస్టాండ్ ఎదురుగా ఉండటంతో.. ప్రధాన రహదారిని ఆనుకుని.. 42 మంది దుకాణాలు నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ భూమిని యజమానుల నుంచి తాము కొనుగోలు చేశామంటూ.. వైసీపీ ప్రజాప్రతినిధి అనుచరులు మేడాపురం సూర్యనారాయణ, రాజారెడ్డి.. అక్కడ నివసిస్తున్నవారి నుంచి వసూళ్లకు దిగడం చర్చనీయాంశమైంది.
వైసీపీ అధికారంలోకి రాగానే.. ప్రజాప్రతినిధి అనుచరులు రాజారెడ్డి, మేడాపురం సూర్యనారాయణ.. రంగంలోకి దిగి.. జానకమ్మ వారసుల్లోని 40 మందిలో ఇద్దరి వద్ద ఓ ఒప్పందం రాసుకుని.. ఇళ్లు నిర్మించుకున్నవారిపై బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆ కాలనీలో 5.93 ఎకరాల్లోని ఇళ్లను ఈటీఎస్ యంత్రం ద్వారా కొలతలు వేసి.. స్థలాన్ని 5 రకాలుగా విభజించారు. దీని ప్రకారం సెంటుకు 2 లక్షల నుంచి 18 లక్షల వరకు రిజిస్ట్రేషన్ ధరను నిర్ణయించారు. డబ్బు చెల్లించకపోతే తాము కాకపోయినా మరెవరైనా వచ్చి ఇళ్లు కూలుస్తారని.. వైసీపీ ప్రజాప్రతినిధి అనుచరులు బెదిరించారు. దీంతో ఆందోళన చెందిన కొందరు దుకాణ, ఇంటి యజమానులు.. 6 నెలల క్రితం వైసీపీ నాయకులకు సుమారు 3 కోట్ల రూపాయలు ముట్టచెప్పారు. డబ్బు చెల్లించినవారికి.. వైసీపీ నాయకులు సూర్యనారాయణ, రాజారెడ్డితోపాటు మరో ఇద్దరు కలిసి అగ్రిమెంట్లు రాసిచ్చారు.
ఈ వసూళ్లను వ్యతిరేకిస్తూ 20 మంది హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా స్టే వచ్చింది. డబ్బు చెల్లించిన బాధితులకు రిజిస్ట్రేషన్ చేయకుండా.. వైసీపీ నాయకులు తిప్పుకుంటున్నారు. జానకమ్మ కుటుంబసభ్యులు వస్తే.. ప్రాధేయపడి ఎంతో కొంత డబ్బు చెల్లిస్తాం తప్ప.. వైసీపీ నాయకులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తే లేదని... ఇంటి యజమానులు చెబుతున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధి బెదిరింపులపై కాలనీ వాసులు.. తెలుగుదేశం ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌తోపాటు.. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఆశ్రయించగా.. వారు బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారికి మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. కోర్టు ఖర్చులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
ఇవీ చదవండి: