CM Jagan Public Meeting at Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా రైతు భరోసా నిధుల విడుదల సభలో సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలోనే మాత్రమే రైతులకు మేలు జరిగినట్లు చెప్పిన జగన్.. గత ప్రభుత్వం అసలు వారిని పట్టించుకోలేదన్నట్లు మాట్లాడారు. తీవ్ర దుర్భిక్షంతో పంటలు ఎండిపోయిన రైతులంతా సీఎం సభకు వచ్చారు. ఆయన నోటి వెంట కరవు మండలాల ప్రకటన వస్తుందని ఆశగా ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. అసలే రాష్ట్రంలో కరవే లేదన్నట్లు సీఎం జగన్ ప్రసంగించడం వారిని ఆశ్చర్యపరిచింది. సభకు వచ్చిన మహిళలకు భోజనం పెట్టకపోవటంతో.. ఆకలితో వారు అలమటించారు. జగన్ ప్రసంగం ప్రారంభం కాగానే సభ నుంచి వెళ్లిపోయారు.
సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ 'చలో పుట్టపర్తి'కి టీడీపీ పిలుపు-నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
చంద్రబాబు పాలనలో నిత్యం కరవు: ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షంతో పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకునేలా సీఎం జగన్ ఒక్క ప్రకటన కూడా చేయకుండా వెళ్లిపోయారు. తీవ్ర వర్షాభావంతో పంటలన్నీ కోల్పోయిన రైతులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి జగన్ వస్తున్నారని.. ఆదుకునే ప్రకటన చేస్తారని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ప్రస్తుతం కరవుతో అల్లాడుతుంటే.. చంద్రబాబు పాలనలో నిత్యం కరవు వచ్చిందని.. తమ ప్రభుత్వంలో నాలుగేళ్లుగా కరవే లేదని సీఎం చెప్పుకొచ్చారు. అన్నదాతలను ఆదుకునేందుకు ఐదేళ్లుగా రైతుల ఖాతాల్లో భరోసా సొమ్ములు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 53 లక్షల 53 వేల మంది రైతుల ఖాతాల్లో... 4 వేల రూపాయల చొప్పున.. 2వేల 204 కోట్లు వేసినట్లు వివరించారు.
పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన - ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇబ్బందులు
పాఠశాలల యాజమాన్యాలకు సర్క్యులర్: సీఎం జగన్ బహిరంగ సభ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా విద్యాశాఖాధికారి.. 401 ప్రైవేట్ పాఠశాలల బస్సులను సభకు జనాన్ని తరలించేందుకు పంపారు. సభకు బస్సులు ఇవ్వాలని పాఠశాలల యాజమాన్యాలకు ముందుగానే సర్క్యులర్ విడుదల చేశారు. అధికారికంగా బడులకు సెలవు ప్రకటించారు. జగన్ సభకు ఎమ్మెల్యేలు బస్సుల్లో తరలించిన జనానికి కనీసం భోజనం కూడా పెట్టలేదు. చాలా మంది గ్రామీణ మహిళలు తిట్టుకుంటూ సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా నేలపై కూర్చొని మంచి నీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. సభకు తీసుకొచ్చిన జనానికి కొందరు మద్యం ప్యాకెట్లు పంచారు. వారు పూటుగా తాగి మైకంతో కదల్లేక నేలపై పడిపోయారు. సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షల వల్ల వాహన చోదకులు ఇబ్బందిపడ్డారు.
హెరిటేజ్ కంపెనీకి మాత్రం లాభాలు: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు మంచి జరగలేదన్న సీఎం...చంద్రబాబు హెరిటేజ్ కంపెనీకి మాత్రం లాభాలు వచ్చాయని విమర్శించారు. వైసీపీ బస్సు యాత్ర జన సంద్రంగా సాగుతుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆక్షేపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా బహిరంగ సభలో సీఎం విమర్శలు గుప్పించారు.
ఇంతగా ప్రజల విశ్వాసం కోల్పోయిన తర్వాత మళ్లీ మీరెందుకు జగన్ !: బీజేపీ నేత సత్యకుమార్