Tension grips Kondapi constituency: నిన్న, మెున్నటి వరకు నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల వర్గపోరుతో సతమతమైన వైసీపీ నేతలకు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం నుంచి వ్యతిరేకత మెుదలైంది. సొంత పార్టీ తమపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉన్న కొండేపి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. వరికూటి అశోక్ బాబు నియోజక వర్గ ఇంచార్జ్‌గా నియమించినప్పటి నుంచి తన చుట్టూ ఉన్న అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారంటూ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో వైసీపీ ఒక వర్గం నాయకులు ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబుపై ఆ పార్టీ నేతలే ఎస్పీకి పిర్యాదు చేశారు. డీసీసీబీ చైర్మన్, వైసీపీ మాజీ ఇంచార్జ్ మాదాసీ వెంకయ్య, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరుణ కుమారి, నియోజక వర్గంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. ఒంగోలు వచ్చి జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రశాంతమైన నియోజకవర్గంలో అశోక్ బాబు ఫ్యాక్షన్ గొడవలు సృష్టిస్తున్నారనీ.. పార్టీలోని వ్యక్తులనూ... ప్రజలనూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారనీ ఆరోపించారు. అశోక్ బాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత వెంకయ్య ఎస్పీని కోరారు. మెుదటి నుంచి పార్టీని నమ్ముకుని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న వారి ఇళ్లకు వెళ్లి, దారికాచి దాడులు నిర్వహిస్తున్నారని డాక్టర్ వెంకయ్య పేర్కొన్నారు. వేరే ప్రాంతం నుంచి వచ్చి వ్యక్తి ప్రశాంతమైన కొండేపిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఓ సారి పార్టీ నుంచి సస్పెండ్ అయిన అశోక్ బాబు ఇప్పుడు ఇక్కడకు వచ్చి తమపై అధికారం చెలాయిస్తున్నారని అన్నారు. అతడు, అతని చుట్టూ ఉన్న రౌడీషీటర్లపై చర్యలు తీసుకోవాలనీ ఎస్పీని కోరినట్లు తెలిపారు.
'కొండేపి నియోజక వర్గంలో అశోక్ బాబు ఇంచార్జ్ గా మారిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అరుణమ్మ, డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డిపై దాడులు చేయించారు. డెవిడ్ రాజును సైతం ఆయన సామాజిక వర్గం వ్యక్తులతో దాడి చేయించారు. ఏఎంసీ చైర్మన్ అయిన ఓ ఎస్టీ మహిళను భయపట్టే పరిస్థితి నెలకొంది. మమ్మల్ని సైతం బెదిరించే ప్రయత్నం చేశారు. అతను ఓ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. సాయి అనే యువకుడిపై దాడి చేస్తే, ఆ వ్యక్తి నిరహార దీక్ష చేసే పరిస్థితి నెలకొంది. వరుస ఘటనల నేపథ్యంలో కొండెపిలో శాంతి భద్రతలు కాపాడాలని ఎస్పీని కోరాం. అధిష్ఠానం స్పందించి అశోక్ బాబుపై చర్యలు తీసుకోవాలి. ఇలా వరుస దాడులు చేస్తుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది.' -డాక్టర్ మదాసి వెంకయ్య, వైసీపీ నేత