ప్రజలకు నిత్యం అవసరమైన ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండు వినియోగంలోకి రాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని ఉన్న బస్టాండులో కనీస సౌకర్యాలు లేకపోవడంతో బస్సులు బస్టాండ్‌కు అలా వెళ్లి చుట్టి రావడం తప్ప ప్రయాణికులకు ఉపయోగం లేకుండా పోయింది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని చుట్టూ ఉన్న మండలాల్లోని గ్రామాలకు బస్సులను మార్కాపురం డిపో నుంచి నడుపుతున్నారు. బస్టాండులో కనీస వసతుల్లేక రాత్రి పూట లైట్లు లేకపోవడంతో మందుబాబులకు స్థావరంగా మారింది. 1984 వ సంవత్సరంలో ఇక్కడ 2 ఎకరాల విస్తీర్ణం మధ్యలో రేకుల షెడ్డు వేసి బస్టాండు ప్రారంభించారు. 2004 నుంచి కనీస సౌకర్యాలు లేకపోవడంతో అక్కడ సాయంత్రం అయితే అంత నిర్మానుష్యంగా మారింది. కానీ ఇప్పుడు పట్టణ విస్తీర్ణం పెరగడంతో ప్రధాన జాతీయ రహదారి కూడా ప్రజలతో రద్దీగా ఉంటుంది. వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. యర్రగొండపాలెం మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు హైదరాబాద్, ఏపీలోని గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు బస్ సర్వీస్ లు నడుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ లో వసతులు కల్పించి వినియోగంలోకి వచ్చేల చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీచూడండి.విశాఖ ఎన్ఎస్టీఎల్ స్వర్ణోత్సవ సంబరాలు...ఉపరాష్ట్రపతి హాజరు