ప్రకాశం జిల్లాలో పట్టణ మౌలిక వసతుల కల్పన సంస్థ (టిడ్కో) నిర్మాణం చేపట్టిన బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేయాలని లబ్దిదారులు ఏళ్లుగా కళలు కంటున్నారు. గత ప్రభుత్వం 2018 డిసెంబరులోపు నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లు అందజేయాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ప్రభుత్వం మారడంతో నిర్మాణాలే నిలిచిపోయాయి. రివర్స్ టెండరింగ్ లో ఇటీవలే ప్రభుత్వం కొత్త గుత్తేదారుకు నిర్మాణ పనులు ఆప్పగించింది. జిల్లాలో ప్రస్తుతం 9,690 ఫ్లాట్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి నూతన గుత్తేదార్లకు ఆమోదం లభించగా జిల్లా కేంద్రం ఒంగోలు శివారులోని కొప్పొలు వద్ద మాత్రమే వారం క్రితం పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల ఇంకా పనులు మొదలు కాలేదు.
ఇల్లు వస్తుందన్న ఆశతో రెండు సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్న వారు అధికారుల చుట్టూ తిరిగి అలసి పోయారు. వస్తుందో రాదో అన్న అయోమయంలో పడ్డారు. ఇప్పటికే డబ్బులు చెల్లించినవారిలో కొందరికి బ్యాంకులు నుంచి డిమాండ్ నోటీసులు అందుతున్నాయి. అటు బ్యాంకు కిస్తీలు కట్టలేక ... అద్దెల భారం మోయలేక అవస్థలు పడుతున్నారు. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొందరికి ఇళ్ల కేటాయింపులు రద్దుచేసిన ప్రభుత్వం వారికి ఇళ్లపట్టాలు అందజేస్తామని, అలానే జీప్లస్ 3 ఇంటికోసం కట్టిన డబ్బులు వెనక్కి తిరిగిస్తామని చెబుతుండటం పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశగా ఎదురు చూసిన ఇళ్లు అందలేదు. కట్టిన డబ్బులు తిరిగి రాలేదు. కొత్తగా ఇళ్ల పట్టాలు ఎప్పుడిస్తారో తెలియదు, అన్ని విధాలుగా నష్టపోయామని బాధితులు వాపోతున్నారు.
60 నుంచి 80 శాతం పూర్తి...
అధునాతన సాంకేతిక పద్ధతులతో వంటగది, హాలు, పడక గదులు, మరగు దొడ్లతో నిర్మిస్తున్న టిడ్కో బహుళ అంతస్థుల్లో నివాసం ఎప్పుడా ఎదురు చూస్తున్న వారి ఆశలను పాలకుల నిర్వాకం, నిర్లక్ష్యం కాలరాసింది. గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 60 నుంచి 80 శాతం నిర్మాణ పసులు పూర్తి అయినా గృహప్రవేశానికి నోచుకోలేదు. ఫలితంగా నిర్మాణాల్లో పాచిపట్టి, పిచ్చి మొక్కలు పెరిగి, చెత్తాచెదారాలతో వర్షపు నీరు నిలిచి.. మురుగు కూపాలుగా దర్శనమిస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం ఇలా వృధా అవుతుంటే అధికారులు కనీసం చూడటం లేదు. లబ్ధిదారులు ఏమీ చేయలేక కుమిలి పోతున్నారు.
పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి..
“ జిల్లాలో టిడ్కో గృహాల నిర్మాణ పనులు దాదాపు 60 శాతం అయ్యాయి. ఏడాది క్రితం నిర్మాణ పనులు నిలిచిపోవడంతో మళ్లీ రివర్స్ టెండర్లకు ఇటీవలే ప్రభుత్వం ఆమోదించింది. వారం క్రితం ఒంగోలు శివారులోని కొప్పోలు వద్ద నిర్మాణ కాంక్రీట్ ఇతర పనులు ప్రారంభమయ్యాయి. మౌలిక వసతులు కల్పన పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం నివాసయోగ్యానికి అనుకూలంగా లేవు. అన్ని పనులు పూర్తి కావడానికి ఏడాది పట్టవచ్చు. సాధ్యమైనంత త్వంగానే నిర్మాణాలు పూర్తిచేసి లభ్ది దారులకు అందజేస్తాం.” --వెంకటేశ్వరరావు ఈఈ, ఎపీ టిడ్కో
ఇవీ చదవండి: తెరుచుకోని థియేటర్లు.. కార్మికులకు తప్పని కష్టాలు