ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏపీఐఐసీ గ్రోత్ సెంటర్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 25 మంది సిబ్బందితో ఐదు విభాగాలుగా విడిపోయి పారిశ్రామిక కేంద్రంలో ఉన్న 160 కంపెనీల్లో తనిఖీలు చేశారు.
పారిశ్రామిక కేంద్రంలోని గ్రానైట్ కర్మాగారాల్లో అనుమతులకు మించి వ్యాపారాలు జరుగుతున్నాయన్న సమాచారం వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని విజిలెన్స్ సిఐ డీటీ నాయక్ తెలిపారు. రికార్డులకు విరుద్ధంగా రాళ్ల నిల్వ ఉంచడం.. అనుమతులకు మించి పాలిష్ రాళ్లను బిల్లులు లేకుండా వ్యాపారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో సిఐలు, ఎస్సైలు, మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.