TTD Chairman YV Subbareddy at Kanigiri: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల వద్ద ఎన్టీఆర్(టిడ్- కో) గృహ సముదాయం వద్ద తితిదే కళ్యాణ మండపం శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తితిదే బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. మండపం శంకుస్థాపన ఆయన చేతుల మీదుగా జరిగింది.
ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న తితిదే కళ్యాణ మండప నిర్మాణానికి తితిదే ఛైర్మన్ పునాది వేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ అన్నారు. సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దీంతో స్థానిక పేద ప్రజలు కల్యాణ మండపంలో అతి తక్కువ ఖర్చులో వివాహాలు చేసుకోవచ్చుని హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు ఇంటి స్థలం పట్టాదారుల కన్నీటిపర్యాంతం..
తితిదే కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్థలంలో.. గతంలో తమకు ఇంటి నివేశన పట్టాలు మంజూరు చేశారని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఎటువంటి సమాచారం లేకుండా మా స్థలాల్లో హడావిడిగా శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. స్థలాలకు సంబంధించిన పట్టాలు చూపిస్తూ.. స్థానికంగా ఏర్పాటు చేసిన సభా ప్రారంగణలో వారంతా కన్నీటిపర్యంతమయ్యారు.
' ఇక్కడ మేము ఇంటి నిర్మాణం చేపట్టాలనుకున్నాం. ఈలోగ గుట్టుచప్పుడు కాకుండా ఇప్పటికిప్పుడు మా స్థలాల్లో కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తామంతా నిరుపేదలం. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి మమ్ములను ఆదుకోవాలి. మరోచోట అయినా ఇంటి పట్టాలు మంజూరు చేయాలి' అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టాల లబ్ధిదారులది ఇలా ఉండగా.. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మండపానికి శంకుస్థాపన చేశారని.. శిలా పలకంలో తన పేరును కూడా రాయలేదని ఆ గ్రామ సర్పంచ్ మండా లోకా అన్నారు. నా పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల దుస్థితి అగమ్యగోచరమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి.. కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశం రద్దు..!