Tirupatamma Kalyanotsavam: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లలో చోరీ ఘటన కలకలం రేపింది. భక్తులు ఒక్కసారిగా అమ్మవారికి అలంకరించిన పూలు, తలంబ్రాల కోసం ఏగబడ్డారు. ఈ క్రమంలో చోరీ జరిగినట్లు ఆలయ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో పోలీసులు చేతులెత్తేయడంతో చోరీ ఘటన జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
కల్యాణం వేదిక సామర్థ్యం 50 మందికేనని అధికారులు నివేదిక ఇస్తే.. అంతకు రెట్టింపు సంఖ్యలో మనుషులు పైకి ఎక్కారు. ఈ కళ్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. కొల్లా, కాకాని వంశీయులతో పాటు, ఎమ్మెల్యే, తదితర 7 జంటలు పీఠలపై కూర్చున్నాయి. పాలకవర్గ సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు ఈ సారి అవకాశం ఇచ్చారు. వేదికపై ఉండే వ్యక్తుల జాబితాను దేవస్థానం అధికారులు పోలీసులకు అప్పగించారు. జాబితాలో పేర్లు, వేదిక పాస్ ఉన్నవారిని మాత్రమే పోలీసులు మొదట్లో అనుమతించారు.
కళ్యాణం చివరలో పోలీస్, రెవెన్యూ, పలు శాఖల అధికారులు, అనధికారులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కళ్యాణ వేదికపైకి ఎక్కి హల్చల్ చేశారు. అనంతరం తలంబ్రాలు పోసే సమయంలో మరికొందరు పైకి చేరారు. మొదట్లో పాస్ లేదని పురోహితుడిని కిందకు దింపిన పోలీసులు, చివర్లో చేతులెత్తేశారు. అనుమతి లేకుండా వేదికనెక్కిన కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి అమ్మవారికి, స్వామివారికి తలంబ్రాలు పోశారు.
దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు, దేవాలయ అధికారులు, సిబ్బంది కళ్యాణం నిర్వహించిన ఉత్సవ విగ్రహాలకు రక్షణగా నిలిచి వాటిని కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయంలోకి చేర్చారు. వేదికపై ఉన్న పూలు, తలంబ్రాల కోసం ఏకబడిన ప్రజలు ఏది దొరికితే అది గుంజుకొని వెళ్లారు. ఈ క్రమంలో అమ్మవారి సేవకు వినియోగించే వింజామర కనిపించకుండా పోయింది. అర్చకులు ఎంత వెతికినా దొరకలేదు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆలయ అధికారులు ఆలయ ప్రధాన అర్చకుడికి నోటీసులు జారీ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: