రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో తెదేపా కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదట ర్యాలీకి అనుమతి లేదని దాదాపు రెండు గంటల పాటు నారాయణరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు తెదేపా నాయకుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత అనుమతించారు.
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని గిట్టుబాటు ధరలు లేకపోవడంతో కూరగాయలను కార్యాలయం ముందు కింద పోసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్న తమను అడుగడుగునా అడ్డుకోవడం దారుణమన్నారు.
అరటి కాయలు, టమాటాలు రోడ్డుపై పడేసి..
రైతు సమస్యలపై " రైతు కోసం తెలుగుదేశం" పేరిట తెదేపా చేపట్టిన నిరసన కార్యక్రమం దోర్నాల మండల కేంద్రంలో నియోజకవర్గ ఇంఛార్జి ఏరీక్షన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నుకసాని బాలాజీ, సీనియర్ నాయకులు డా. మున్నే రవీంద్రతో పాటు నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నటరాజ కూడలిలో అరటి కాయలు, టమాటాలు, బొప్పాయి రోడ్డు మీద పడేసి నిరసన తెలిపారు. అనంతరం ఎడ్లబండి మీద నిలబడి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదని, సబ్సిడీ మీద రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించలేదన్నారు.
వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని నినాదాలు చేశారు.. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వెలిగండ్ల మండలంలో తెదేపా ఇంఛార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు, రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల తెదేపా కార్యకర్తలు, రైతులు వెలిగండ్ల మండలం మోగులూరు గ్రామం నుంచి ర్యాలీగా తరలిరాగా మొగులూరు గ్రామ శివారులో పోలీసులు అడ్డగించారు. దాంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తెదేపా శ్రేణులు భారీగా రావడంతో చేసేదేమీ లేక పోలీసులు పక్కకు తప్పుకున్నారు. అనంతరం అక్కడ నుండి ర్యాలీగా వెళ్లి వెలిగండ్ల మండలం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి: TDP: చిత్తూరు జిల్లాలో 'రైతు కోసం తెదేపా'..పలుచోట్ల ఉద్రిక్తత