కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటినుంచి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పగటిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలనుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకూ దీనిని కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజల్లోనూ అవగాహన కల్పించారు. రేపటి నుంచి నిబంధనలు అతిక్రమించేవారిపై జరిమానా విధించి, కేసులు నమోదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
పారిశ్రామిక, వ్యవసాయ, అత్యవసర సర్వీసులు మినహా అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు నిబంధనల మేరకు సమయపాలనను తప్పక పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు తమ పనులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 లోగా ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆర్టీసీ బస్సులు సైతం కర్ఫ్యూ వేళలకు అనుగుణంగా తమ సర్వీసులను మార్చుకోవడం వల్ల కేవలం 60 శాతం బస్సులే తిరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తందా 8 డిపోల్లో దాదాపు 700 పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
చీరాలలో కర్ఫ్యూ వాతావరణం..
అత్యవసరమైతేనే తప్ప బయటకువస్తే కఠినచర్యలు తప్పవని ప్రకాశం జిల్లా చీరాల ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ హెచ్చరించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూకు అందరూ సహకరించాలన్నారు. నగరంలోని అన్ని దుకాణాలు మధ్యాహ్నం 12 తరువాత మూసివేయడంతో పట్టణంలోని రోడ్డులు నిర్మానుషంగా మారాయి. దీనికి తోడు అన్ని కూడళ్లలో పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: