ప్రకాశం జిల్లాలోని పాత రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1,000 ఆర్థిక సాయం విడుదలైంది. లాక్‌డౌన్ అమల్లో భాగంగా రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ నవశకం ద్వారా అనర్హుల దగ్గర ఉన్న రేషన్ కార్డులను గుర్తించింది. వారికి కొత్తగా బియ్యం కార్డుల మంజూరును ఆపేసింది. కరోనా నేపథ్యం, లాక్‌డౌన్ దృష్ట్యా పాత జాబితా ఆధారంగానే రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కిలో కందిపప్పుతో పాటు కార్డులోని సభ్యుల ఆధారంగా 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేసింది. ఆమేరకు అధికారులు వారందరికి గత నెల 29 నుంచి సరకుల పంపిణీ ప్రారంభించారు. చౌక ధరల దుకాణాల ద్వారా రేపటినుంచి రెండో విడత, 29న మూడో విడత ఉచితంగా సరకులు అందజేయనున్నారు.
రూ. 1000 ఆర్థిక సాయం మాత్రం తొలుత కొత్తగా బియ్యం కార్డు కుటుంబాలకు మాత్రమే మంజూరు చేశారు. ఆ మేరకు జిల్లాలోని 8,93,779 కార్డుదారులకు మాత్రమే నగదు విడుదల చేశారు. దీనిపై ప్రభుత్వానికి వినతులు అందిన తర్వాత పాత రేషన్ కార్డులకూ ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తాజాగా జిల్లాలోని పాత కార్డుల జాబితా ఆధారంగా మరో 67,182 కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున రూ.6,71,82,000 నగదు విడుదలైంది. మరో 2 రోజుల్లో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేపట్టనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ ఏలీషా తెలిపారు.
ఇవీ చదవండి: