ప్రకాశం జిల్లా కంభం మండలంలో.. కంభం చెరువుకు ఆవల, కొండలను ఆనుకుని ఉన్న మారుమూల గ్రామం పెద్ద నల్లకాల్వ. ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి ప్రాంతంలో క్రీడా సౌకర్యాల గురించి పెద్దగా ఆశించాల్సిన పనిలేదు. కానీ.. తాను చదువుకునే రోజుల్లో.. క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక.. ఆశించిన లక్ష్యాలను చేరలేకపోయిన ఓ తండ్రి.. తన కలల తీరాన్ని కుమార్తెల ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దనల్లకాల్వకు చెందిన రంగనాయకుల చౌదరి.. తన నలుగురు కుమార్తెల్లో ఇద్దరిని చదువువైపు నడిపించి.. మరో ఇద్దరికి క్రీడలను పరిచయం చేశారు.
పెద్ద కుమార్తెల చేత సీఏ చేయించిన రంగనాయకుల చౌదరి.. మూడో కుమార్తె రంగ ఝాన్సీకి అథ్లెటిక్స్‌లో, నాలుగో కుమార్తె రంగ జయకు జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. పదో తరగతి దాకా హైదరాబాద్ హకీంపేట క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్ కోర్సు చేసిన రంగ ఝాన్సీ.. ఇంటర్ కోసం నెల్లూరులో ప్రభుత్వ అకాడమీలో సీటు సంపాదించింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతూ... సాధన సాగిస్తోంది. ఇప్పటిదాకా రాష్ట్ర స్థాయిలో 50, జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించింది. దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష నిర్వహించిన క్యాంప్‌లోనూ పాల్గొంది. గతంలో చంద్రబాబు చేతుల మీదుగా సీఎం ఎచీవ్‌మెంట్ అవార్డూ అందుకుంది. నాలుగో తరగతిలోనే కడప క్రీడా పాఠశాలకు ఎంపికైన రంగ జయ.. 9వ తరగతి వరకు అక్కడ చదివి.. తర్వాత కాకినాడ జిమ్నాస్టిక్స్ అకాడమీలో చేరింది. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న రంగ జయ.. రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర, సౌత్ జోన్ పోటీల్లో ఆల్‌రౌండ్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఇదీ చదవండీ.. Telangana: బీ అలర్ట్.. గాలి ద్వారా డెల్టా వేరియంట్ వ్యాప్తి: డీహెచ్ శ్రీనివాసరావు