ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనపై మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. బుధవారం గ్రామంలో బాధిత కుటుంబాలను కలిసి వారి వద్ద వివరాలు సేకరించారు. అనంతరం ఔషధ దుకాణాలు, గ్రామంలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించి ఖాళీ శానిటైజర్ బాటిళ్లను సేకరించారు. వాటిని పరీక్షల కోసం ల్యాబులకు పంపనున్నట్లు తెలిపారు.
ప్రత్యేక బృందం అధికారి చౌడేశ్వరి మాట్లాడుతూ.. శానిటైజర్‌ను మందుల దుకాణదారులు ఎక్కడ కొనుగోలు చేశారు, వాటిని ఎక్కడెక్కడ అమ్మారు అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో గ్రామస్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తమ బృందంలోని అధికారులు రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్ తయారుచేసే కంపెనీలను విచారిస్తున్నారని వివరించారు.
మంగళవారం రాత్రి జరిగిన విచారణలో ప్రత్యేక బృందం కురిచేడులో సుమారు 32 దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్ముతున్నట్లు.. మందుల దుకాణాల్లో శానిటైజర్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొందరు దుకాణదారులు 5, 10 లీటర్ల క్యానుల్లో శానిటైజర్‌ను కొనుగోలు చేసి.. వినియోగదారులకు అమ్మినట్లు గుర్తించారు. వ్యాపారులు చేసిన పాపానికి అమాయకులు బలయ్యారని స్థానికులు అంటున్నారు.
ఇవీ చదవండి...