ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామంలో తండ్రీకుమారుడు దర్శి బ్రాంచ్ సాగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి గోవిందు వీరాయపాలెంలో కోళ్ల ఫామ్ చూసుకుంటూ ఉంటాడు. కుమారుడు గుంటూరు జిల్లా వినుకొండలో నివాసముంటాడు. బుధవారం కోళ్ల ఫామ్లో కోళ్లు కొన్ని చనిపోయాయి. విషయం తెలుసుకున్న కొడుకు గ్రామానికి చేరుకొని తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మనస్తాపానికి గురైన తండ్రి గోవిందు బుధవారం రాత్రి ఇంటి నుంచి అలిగి వెళ్ళిపోయాడు.
ఉదయానికీ తన తండ్రి ఇంటికి రాకపోవటంతో వెతకటం ప్రారంభించారు. గురువారం ఉదయం పొలాల వెంట వెతుకుతుండగా దర్శి బ్రాంచ్ సాగర్ కాలువ గట్టుమీద చెప్పులు, కండువా కనపడటంతో తన తండ్రి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కుమారుడు నిర్ధరించుకున్నాడు. తన వల్లే నాన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడని తానూ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
గురువారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందటంతో.. అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చేపట్టారు. ఇరువురి జాడ మాత్రం తెలియరాలేదు.గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇదీ చదవండి:'న్యాయవ్యవస్థపై విశ్వాసం లేకపోతే హైకోర్టును మూసేయమనండి'