రంగవళ్లులు, గంగిరెద్దులు, కోలాటాలు, బొమ్మలకొలువులతో రాష్ట్రంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంస్కృతి, సంప్రదాయాలు కలగలిపి నిర్వహిస్తున్న వేడుకల్లో చిన్నాపెద్దా సందడిచేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో.... రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇటకర్లపల్లి సంక్రాంతి విశేషాలు
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో ఇటకర్లపల్లిలో సంక్రాంతి పండుగ రెండు రోజులు ముందుగా జరుపుకుంటుంది. మాములుగా సంక్రాంతిని ఈ ఏడాది మంగళ,బుధ,గురువారాల్లో జరుపుకుంటారు. కానీ ఇటకర్లపల్లికి చెందిన మీసాల వారి కుటుంబాలు మాత్రం... ఆది,సోమ వారాల్లో జరుపుకోవటం ఆనవాయితీని గ్రామస్థులు తెలుపుతున్నారు. గ్రామంలో ఉన్న వివిధ వృత్తిదారులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని గ్రామస్థులు తెలియజేస్తున్నారు. పిండివంటలు, కొత్త బట్టలతో, పెద్దలకు సాంగ్యాలు జరుపుకుంటారు. మహిళలకు పసుపు కుంకుమ, రాశి బొట్టు పెట్టి గాజులు అందించి ఆశీర్వాదం తీసుకుంటారు. అనంతరం గ్రామస్థులు అందరకూ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామంలో మాత్రం ప్రతి ఏటా రెండు సంక్రాంతులు వస్తాయని ఆనందంగా జరుపుకుంటామని అంటున్నారిక్కడి ప్రజలు.
కడప జిల్లా రాయచోటి పురపాలక కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యాలయం ఎదుట ముగ్గులు వేసి భోగి మంటలు వేశారు. పొంగళ్ళు పెట్టి ప్రసాదాలు వండారు. ఆటపాటలతో సందడి చేశారు. మహిళలకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు. ప్రతి ఏటా సంక్రాంతి ప్రజలు సుఖశాంతులతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్న శ్రీకాంత్ ... వచ్చే ఏడాది సంక్రాంతిలోపు రాయచోటి పురపాలిక అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు
కర్నూలు జిల్లా కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీలో ముందస్తు సంక్రాంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేశారు. ఎంపీడీవో మంజులవాణి, ఉప తాహసీల్దార్ లోకేశ్వరి, ఐసీడీఎస్ సిబ్బంది నృత్య ప్రదర్శన చేశారు. మహిళలకు వంట పోటీలను, రంగవల్లి పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ , చిత్రలేఖనం పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు.
కృష్ణాజిల్లా తిరువూరు జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో పురపాలక సంఘం రెవెన్యూ మండల పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ వంటలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు.భోగి మంటలు వేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గంగిరెద్దులు, హరిదాసులో సందడి వాతావరణం నెలకొంది.
ఘనంగా సంక్రాంతి సంబరాలు
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిషత్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలని డీసీసీసీబీ అధ్యక్షుడు విక్రాంత్ తెలిపారు. సీఎం జగన్ పాలనలో అందరికీ మంచి జరుగుతుందన్నారు గోపూజ, భోగి మంటలు ఆడంబరంగా నిర్వహించారు. రంగవల్లి పోటీలు నిర్వహించారు. చిన్నారుల ప్రదర్శనలతో సంక్రాంతి శోభ సంతరించుకుంది. నరసన్నపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రదర్శన జరిగింది. వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఇచ్ఛాపురంలో తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం ప్రత్యేక అధికారి సీతారామమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో మహిళలు ముగ్గులు వేశారు. తాళాలతో కనువిందు చేసే గంగిరెద్దులాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ముగ్గులతో పండుగ ప్రాముఖ్యత
గిద్దలూరు నగరపంచాయతీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పండుగ ప్రాముఖ్యతను ముగ్గుల ద్వారా తెలియజేశారు. చీరాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులతో హాజరయ్యారు. అధికారులు, మహిళలు భోగి మంటలు వేశారు. చిన్నారులు హరిదాసు వేషధారణలతో అలరించారు. గంగిరెద్దులు వాయిద్యాల నడుమ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. మహిళలు రంగవల్లులు తీర్చిదిద్దారు. కొన్ని రంగవల్లులు సందేశాత్మకంగా ఉన్నాయి. విజేతలైన మహిళలకు కమిషనర్ బహుమతులు అందజేశారు.
ఇవీ చదవండి