ప్రకాశం జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ వ్యాపారం విచ్చలవిడిగా సాగిపోతోంది. రాజకీయ నాయకుల అండదండలతో, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ వ్యాపారం యథేఛ్చగా జరుగుతోంది. జిల్లాలో సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లో ఈ దందా పెద్ద ఎత్తున సాగుతోంది. దర్శి నియోజకవర్గం మొత్తంలో పోలవరం ఒక్కటే అధికార రీచ్ ఉంది... కానీ దాదాపు 25 చోట్ల అనధికార రీచ్‌లు ఏర్పాటు చేసి, రాత్రిపగలు ఇసుక తరలిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ముసినది, దోర్నపువాగు, చిలకలేరు వాగుల పరిధిలో తాళ్లూరు, గంగవరం, బొట్లపాలెం, దర్శి, కొత్తపల్లి, యర్ర ఒబనపల్లి, మారేళ్ళ, వేముల, దొనకొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు.
సంతనూతలపాడు మండలంలో గుండ్లకమ్మ వాగు మొత్తం ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌లోపల ఉన్న కొండల్లో కంకర కూడా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. జిల్లాలో కొండెపి, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లోనూ ఇసుక అక్రమ వ్యాపారం సాగుతుందునే విమర్శలు ఉన్నాయి. రోజుకు వేలాది లారీలు ఇతర జిల్లాలకు, పట్టణాలకు రవాణా చేస్తున్నారు.
ఎస్.ఈ.బి అధికారులు చేసిన అడపాదడపా దాడుల్లోనే కోట్ల రూపాయల విలువచేసే ఇసుక స్వాధీనం చేసుకున్నారు. గత ఆరు నెలల్లో 13,591 టన్నులు ఇసుక స్వాధీనం చేసుకున్నారు. తొలిసారి పట్టుబడితే 10వేల రూపాయలు జరిమానా వేసి వాహనాన్ని వదిలవేస్తున్నారు. మరో సారి దొరికితే వాహానాన్ని సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు తమకు లేవని.. అక్రమ ఇసుక వ్యాపారం, రవాణాను అడ్డుకొని కేసులు రాస్తున్నామని ఎస్.ఈ.బి. అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: