Animals Warriors Conservation Society: స్వచ్ఛత కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని వీధులను ప్రభుత్వం పరిశుభ్రం చేస్తుంటుంది. మరి సముద్ర తీరాలు, సముద్ర గర్భంలోని కాలుష్యం సంగతేంటి..? అన్నప్పుడూ ఎవ్వరూ సరైన సమాధానం చెప్పలేరు. ఈ పరిస్థితిని మార్చేందుకు, సముద్ర గర్భాన్ని శుభ్రం చేసేందుకు పూనుకుంది ఓ స్వచ్ఛంద సంస్థ. తీర ప్రాంతాలు, సముద్రంలోని కాలుష్యం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ.. వ్యర్థాలను తొలగిస్తూ.. స్వచ్ఛమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఆ సంస్థే.. యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ.
హైదారాబాద్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థ.. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంతోపాటు అనేక మత్స్యకార గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతోంది. సముద్ర కాలుష్యాన్ని నివారించటం, ప్రమాదంలో చిక్కుకున్న మూగజీవులను కాపాడటం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు ఉపాధి మార్గాలు చూపడం వంటి పనులు చేస్తున్నారు ఈ సంస్థ సభ్యులు.
చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల వలలు సముద్రగర్భంలో ఉన్న కొండల్లో చిక్కుకుని తెగిపోతుంటాయి. వాటితోపాటు.. టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర గర్భంలో పేరుకుపోయి నీటిలో నివసించే జంతువుల మనుగడకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. ఈ కాలుష్యంతోపాటు నదులు, కాలువల వరదలు మోసుకొచ్చే ప్లాస్టిక్ వర్థాలు.. సముద్రంలో గుట్టలుగా పేరుకుపోతున్నాయి. సముద్ర గర్భంలో పేరుకు పోయిన టన్నుల కొద్ది ప్లాస్టిక్ ను తొలగించడానికి యానిమల్ వారియర్స్ సభ్యులు కృషి చేస్తున్నారు. మత్స్యకారులకు, తీర ప్రాంతాలకు వచ్చే సందర్శకులకు సముద్ర కాలుష్యం, పరిశుభ్రంగా ఉండాల్సిన విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.
సముద్ర తీర ప్రాంతాల్లోనే కాకుండా ఎక్కడైనా మూగజీవాలు ప్రమాదంలో ఉంటే వాటిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. మత్స్యకార గ్రామాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా చీపుర్ల తయారీపై శిక్షణ ఇప్పించి, వారి చేత ఓ యూనిట్ ఏర్పాటు చేయించారు. దీనివల్ల తమకు ఉపాధి దొరికిందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నివారణకు యానిమల్ వారియర్స్ చేస్తున్న కృషిని మత్స్యకార గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ర్యాలీ