ప్రకాశం జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 21న ఒంగోలు మండలం గుడిమెళ్ళపాడులో మంత్రి బాలినేని లాంఛనంగా జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని ప్రారంభించారు. క్షేత్ర స్థాయిలో కొండి కందుకూరులో సర్వేని ప్రారంభించారు. జిల్లాలో తొలిదశలో 350 గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టే కార్యక్రమం గాబట్టి నిర్ధిష్ట గడువు అంటూ పెట్టుకోలేదు. అయితే చేపట్టాల్సిన సర్వే విషయంలో అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో తొలిదశ సర్వే పూర్తయ్యే నాటికి చాలా సమయం అయ్యేటట్లు కనిపిస్తుంది. ప్రాథమికంగా గ్రామ సరిహద్దులను గుర్తించడం, ప్రభుత్వ భూముల సరిహద్దులు నిర్ధారించడం, డ్రోన్ ఫ్లై కార్యక్రమం చేపట్టాలి.
శాఖల మధ్య సమన్వయ లోపం..
తొలి రెండు పనులు సర్వే శాఖ అధికారులు, వారి సిబ్బందితో చేపట్టాలి. డ్రోన్ ఫ్లై కార్యక్రమం సర్వే ఆఫ్ ఇండియా తో చేపట్టాలి. గ్రామ, ప్రభుత్వ సరిహద్దుల కార్యక్రమం జిల్లాలో ఇంతవరకూ 12 గ్రామాల్లో చేపట్టారు. డ్రోన్ ఫ్లై కూడా ఈ గ్రామాల్లో పూర్తి చేశారు. డ్రోన్ ఫ్లై అనంతరం చిత్రాలు సర్వే బృందాలకు అప్పగించాలి. కానీ ఇంతవరకూ చిత్రాలు ఇవ్వలేదు. గతంతో పోల్చి చూస్తే సర్వే కోసం సిబ్బంది కొరత లేదనే చెప్పాలి. గ్రామ సచివాలయంలో సర్వే ఉద్యోగనియమకాల వల్ల సర్వే చేపట్టడానికి అవసరమైన మానవ వనరులు సమకూరాయి. సాంకేతికంగా మాత్రం అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. రెవెన్యూ శాఖ పరంగా సర్వే శాఖకు సరైన సహకారం లభించడంలేదనే విమర్శలు ఉన్నాయి.
వేధిస్తున్న నిధుల కొరత..
సర్వే శాఖను నిధులు కొరత సైతం వేధిస్తుంది. సర్వే చేసే సమయంలో గ్రామ కంఠాలు గుర్తించేందుకు చూనా మార్కింగ్ ( సున్నంతో ముగ్గు) చేయాలి. ముగ్గు పిండి కొనుగోలుకు కూడా నిధులు లేవు. సర్వే సమయంలో రైతులు సైతం సహకారం అందించడంలేదని సర్వే సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. భూములపై ఉన్న హక్కులకు ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో సర్వే అధికారులు వేసిన గుర్తులను తొలగిస్తున్నారు. వారిలో ఉన్న అనుమానాలను అధికారులు తొలగించాల్సిన అవసరం ఉందని సర్వే శాఖ అధికారులు కోరుతున్నారు. ఇప్పటికైనా సర్వే క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపట్టాలంటున్నారు.
ఇదీ చదవండి:
కారంచేడు కన్నీరుమున్నీరు..ఉప్పరపాలెంలో ఇంటింటా కరోనా బాధితులు