కరోనా దెబ్బతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రవాణా, ఉత్పత్తి రంగాలపై కొవిడ్ ప్రభావాన్ని సాకుగా చూపుతూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లలోని అన్ని రకాల సరకుల ధరలను వ్యాపారులు పెంచేశారు. లాక్‌డౌన్ మొదట్లో కూడా ఇదే పరిస్థితి ఉండేది. అప్పట్లో జేసీ ఆదేశానుసారం పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారులు దుకాణాలపై దాడులు నిర్వహించి.. ధరలను కొంత మేర అదుపులోకి తెచ్చారు. ప్రతి వస్తువు ధరను తెలిపే పట్టిక వాటి ముందు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అందుకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించే దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. జరిమానాలు విధించారు. ఇలా రెండు నెలలపాటు కఠినంగా సాగినా..రానురాను అలసత్వం వహించారు. జేసీ ఛైర్మన్‌గా ఉన్న ధరల నియంత్రణ పర్యవేక్షక కమిటీ కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.
అన్ని రకాల నిత్యావసరాల ధరలు నెల రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి. కొవిడ్‌తో ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ కష్టంగా మారిన పేదలకు వీటిని కొనే పరిస్థితి లేక పస్తులుంటున్నారు. మహారాష్ట్ర, కర్నాటకతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సరకులు ఆశించినంతగా రాకపోవడం, భారీ వర్షాలకు పంట దిగుబడులు తగ్గడం, రవాణా సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంతో ధరలు పెరిగాయని టోకు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో చిరు వ్యాపారులు చేసేదేమీ లేక సరకుల ధరలు పెంచి విక్రయిస్తున్నారు.
సమావేశాల జాడేది…
జేసీ ఛైర్మన్‌గా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, డీఎం, తూనికలు, కొలతల శాఖ, మార్కెటింగ్ శాఖతోపాటు ఇతర అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో జిల్లా స్థాయిలో ధరల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ ఉంది. నిబంధనల ప్రకారం ఇది రెండు నెలలకోసారి సమావేశం కావాలి. చర్చించాలి. అవసరమైతే తక్షణ చర్యల నిమిత్తం రివాల్వింగ్ ఫండ్ నుంచి నిధులు కేటాయించడం ద్వారా బయట మార్కెట్లో ధరలు తగ్గే వరకు సదరు వస్తువులను రైతు బజార్లల్లో విక్రయించాలి. అయితే అసలు సమావేశాల్నే గాలి కొదిలేశారు. ముఖ్యంగా ఒంగోలు, అద్దంకి, చీరాల, కనిగిరి, మార్కాపురం, కందుకూరు, దర్శి, పొదిలి, ఇతర ప్రాంతాల్లో వ్యాపారులు సరకుల ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఈ విషయం కమిటీ ఉన్నతాధికారులకు తెలిసినా ఇతర ప్రాధాన్యత పనుల్లో బిజీగా ఉన్నామంటున్నారు. దీంతో వ్యాపారుల హవా కొనసాగుతోంది.
నియంత్రిస్తాం..
“ నాలుగైదు రోజుల్లో పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తాం. మార్కెట్లో నిత్యావసరాల ధరలపై సమీక్షిస్తాం. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి తగు ఆదేశాలు ఇస్తాం. అధిక ధరలను నియంత్రిస్తాం.” - వెంకట మురళీ, జేసీ
ఇవీ చదవండి: టిడ్కో ఇళ్ల కేటాయింపు ఎప్పుడో..??