ప్రకాశం... అటు రాయలసీమ,ఇటు కోస్తాంధ్రకు మధ్యలో ఉండే జిల్లా. ఇక్కడి వాతావరణం లాగే ..రాజకీయాలు అంతే వాడివేడిగా ఉంటాయి. పంతానికి పోయే ప్రకాశం నేతలతో రాజకీయ పార్టీలు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. కిందటి ఎన్నికల్లో ప్రకాశంలో సత్తా చాటిన ప్రతిపక్ష పార్టీ మరోసారి పాగా వేసేలా వ్యూహాలు పన్నుతుంటే... అధికార పార్టీ మాత్రం పసుపు జెండా ఎగరటం ఖాయమంటోంది. ఎన్నికల నగారా మోగకముందే పార్టీ ఫిరాయింపులు, సీట్లు గొడవలు, అలకలు, బుజ్జగింపులు వంటి రాజకీయ పరిణామాలతో ప్రకాశం పంచాయతీ రసవత్తరంగా మారుతోంది.
పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉన్న ప్రకాశం జిల్లాలో ఎన్నికలు దగ్గరపడేకొద్ది సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో చావోరేవో తేల్చుకునేందుకు తెదేపా-వైకాపా సిద్ధమవుతున్నాయి. 2014 ఎన్నిల్లో వైకాపా 6, తెలుగుదేశం5, నవోదయ పార్టీ ఒక సీట్లు కైవసం చేసుకున్నాయి. వైకాపా కోస్తాలో తెలుగుదేశం కంటే .. ఎక్కువ సీట్లు సాధించిన రెండు జిల్లాల్లో ప్రకాశం ఒకటి. మారిన రాజకీయ సమీకరణాలతో వైకాపా నుంచి గెలిచిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిలు సైకిల్ ఎక్కటంతో వైకాపా బలం రెండుకు పడిపోయింది. చీరాల నుంచి నవోదయ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా తెలుగుదేశంలో చేరారు. పశ్చిమ ప్రకాశం.. సామాజిక సమీకరణాల దృష్ట్యా... వైకాపాకు అండగా నిలుస్తుండటంతో ఎమ్మెల్యేలు పార్టీలు మారినా ద్వితీయ శ్రేణి నాయకులు, ఓటర్లలో ఆ పార్టీ పట్ల కొంత సానుకూలత ఉందనే చెప్పాలి. మినీ డెల్టాగా భావించే ఒంగోలు నుంచి గుంటూరు వైపు భాగమైన నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న ప్రాంతంగా భావిస్తుంటారు. అందువల్ల కొండెపి నుంచి ఒంగోలు, పరుచూరు నియోకవర్గాల వరకూ దేశం పార్టీ గెలుచుకోవడం, అద్దంకి లో వైకాపా గెలిచినా,అక్కడి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోకి రావడంతో ఆ ప్రాంతాల్లో పార్టీకి పట్టుఉందనే చెప్పాలి.
బలబలాలు పక్కనపెడితే...తెదేపాలో చురుకుగా ఉండి..సీఎం అండతో పెద్ద ఎత్తున నిధులు రప్పించుకొని చీరాలలో తనకంటూ ఓ గట్టి వర్గాన్ని ఏర్పారుచుకున్న ఎమ్మెల్యే ఆమంచి హఠాత్తుగా తెదేపా పై అసమ్మతి గళం వినిపించి...వైకాపాలో చేరటం..జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఆమంచిని ఎదుర్కోవాలంటే సీనియర్ నేత కరణం బలరాంను బరిలోకి దించేలా తెదేపా ఎత్తులు వేస్తోంది.
సంతనూతలపాడు విషయంలో తెదేపాఎటూ తేల్చుకోలేకపోతుంది. కొంత కాలంగా ఈ స్థానంపై ఇతర పార్టీల జెండాలే ఎగురుతున్నాయి. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన బి.ఎన్.విజయ్‌కుమార్ పార్టీ బాధ్యతలు చూస్తున్నారు ఆయన అభ్యర్థితత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఓ సామాజికవర్గం బి.ఎన్ కు టికెట్ ఇవ్వొద్దని ఆందోళన చేస్తుంది. ఇక్కడ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలక సురేష్ ఎర్రగొండపాలెం నియోకర్గానికి వెళుతుండటంతో వైకాపాకు అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి నియోజవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సుధాకరబాబు టికెట్ ఆశిస్తున్నారు.
ఇరు ప్రధాన పార్టీలు అసమ్మతి సెగలను ఎదుర్కొంటున్న నియోజకవర్గం పరచూరు. కిందటి ఎన్నికల్లో తెదేపా నుంచి గెలిచిన ఏలూరి సాంబశివరావుకే తిరిగి టికెట్ దక్కేలా ఉంది.అయితే పార్టీలో ఇయనకు వ్యతిరేకంగా కొంతమంది సమావేశాలు పెడుతూ..ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష వైకాపా తరుపున రాజకీయ ప్రాబల్యం ఉన్న దగ్గుబాటి కుటుంబం నుంచి పోటీకి దింపేందుకు రంగం సిద్దం చేస్తుంది ఫ్యాన్ పార్టీ. భాజపా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి కుమారుడు హితేష్ చెంచురామ్ గానీ, భర్త దుగ్గుబాటి వెంకటేశ్వరరావు గానీ నిలబడే అవకాశం కనిపిస్తోంది. వారు వీరు...వీరు వారైన గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికంగా ఉంది. వైకాపా నుంచి గెలిచిన అశోక్ రెడ్డి తెదేపాలో చేరగా...ఆయన చేతిలో ఓడిపోయిన తెదేపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు..వైకాపాలో చేరారు. ఈసారి కూడా పోటీ వీరిద్దరి మధ్యే ఉండబోతుంది. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డి వైకాపాను వీడి తెదేపాలో చేరడంతో బలాబలాలు మారుతున్నాయి. కందుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోతుల రామారావుకు, వైకాపా నుంచి మాజీ మంత్రి ఎమ్. మహిధర్‌రెడ్డి మధ్య పోటీ ఉండొచ్చు. అధికార పార్టీలో ప్రతిష్టంభనకు దారితీస్తున్న స్థానం కనిగిరి. ఇక్కడి నుంచి నందమూరి బాలకృష్ణ స్నేహితుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహం తెదేపాలో చేరి టికెట్ దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు.తొలి నుంచి అనుకుంటున్న విధంగా బుర్రా మధుసూధన యాదవ్‌కే వైకాపా నుంచి అవకాశాలున్నాయి. జిల్లాలో ఫ్యాన్ గాలి వీచిన న మార్కాపురంలో ప్రధాన పార్టీల్లో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. తెదేపా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న కందుల నారాయణరెడ్డిని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్ష వైకాపా నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి ఎక్కువ అవకాశాలున్నా... కెపీ కొండారెడ్డి వర్గం తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలో ఉన్న ఏకైక మంత్రి శిద్ధా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారబోతుంది. అధికార పార్టీ నుంచి తిరిగి శిద్ధాకే అవకాశం కల్పించారు. వైకాపా విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. తొలుత బాదం మాధవరెడ్డి కి టికెట్ ప్రకటించారు. ఈ ప్రకటనపై తొలి నుంచి పార్టిని నడిపిస్తున్న బూచేపల్లి శివప్రసాద్ వర్గం వ్యతిరేకించింది. దీంతో ఇటీవల పార్టిలో చేరిన మద్దిశెట్టి వేణుగోపాల్ కు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇచ్చారు... అత్యంత సమస్యాత్మకంగా భావించిన అద్దంకి నియోజకవర్గంలో అభ్యర్థిత్వాన్ని తెదేపా ఓ కొలిక్కి తెచ్చింది. ఎమ్మెల్సీ కరణం బలరాం తన కుమారుడు వెంకటేష్‌కు టికెట్ కోసం ప్రయత్నించిన్పటికీ ..చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగొట్టిపాటి రవికుమార్‌కే ఖరారు చేశారు. వైకాపా నుంచి చెంచు గరటయ్యకు పేరును ఖాయం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం లో వైకాపా తరుపున సంతనూతలపాడు నుంచి గెలిచిన ఎమ్మెల్యే సురేష్‌కు టికెట్ ఖరారయ్యింది... తెలుగుదేశం పార్టి తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈయన పట్ల ఇక్కడ ప్రధాన వర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది.. మొత్తం మీద రెండు పార్టీలకు చెందిన కీలక నియోజకవర్గాల్లో టికెట్లు కోసం పోటీ ఎక్కువవుతుంది...పార్టీ అభ్యర్థులకోసం చిన్న చిన్న విభేధాలు ఉన్నా సర్దుకొని పోతామని జిల్లా నేతలు అంటున్నారు.
ఈ జిల్లాలో ఉన్న ఏకైక ఒంగోలు పార్లమెంట్ స్థానంలో అధికార- ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ ఉంది. 2014 సంవత్సరంలో తెదేపా తరపున మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వైకాపా తరపున వై.వి సుబ్బారెడ్డిలు తలపడ్డారు. ఈ హోరులో 15650 ఓట్ల తేడాతో వై.వి గెలుపోందారు. అయితే ప్రత్యేక హోదా కోసం సుబ్బారెడ్డి రాజీనామా చేశారు.వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి ఆయనే నిలబడే అవకాశం ఉంది. అయితే ఇటీవల మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెదేపా నుంచివైకాపాకు మారతారనే ప్రచారం బాగా జరుగుతోంది.
జిల్లాలో జనసేన , భాజాపా, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికల్లో ఉన్నా... వీటి ప్రభావం నామమాత్రం. జనసేన అధినేత పవన్ పర్యటన జిల్లాలో ఇంతవరకూ సాగలేదు. ఈ నెలాఖరులోగా ఆయన పర్యటన ఉండచ్చని, తరువాత అభ్యర్థుల జాబిత ఖరారయ్యే అవకాశం ఉంది.
ఇవీ కూడా చదవండి:తూర్పుగోదావరి నేతలతో సీఎం భేటీ