ప్రకాశం జిల్లా ఎస్పీ మాలిక గర్గ్.. చీరాల సబ్ డివిజన్‌లోని చినగంజాం, ఇంకొల్లు, పర్చూరు, కారంచేడు, వేటపాలెం, చీరాల ఒకటి, రెండో పట్టణ, ఈపూరుపాలెం, యద్దనపూడి పోలీసు స్టేషన్లను గురువారం సందర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆమె సూచించారు.
కేసుల దస్త్రాలు పరిశీలించి..పెండింగ్ లేకుండా త్వరితగతిన దర్యాప్తు చేయాలని అధికారులకు చెప్పారు. జూదం, అనధికార మద్యం, సారా విక్రయాలు, ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని.. స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించి...వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఇంకొల్లులోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో మహిళా పోలీసులతో ప్రత్యేకంగా నిర్వహించిన సదస్సుల్లో మాట్లాడారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అందరితో దిశయాప్ డౌన్‌లోడ్ చేయించడంతో పాటు..వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. విధి నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. పర్చూరులో వృద్ధురాలిపై జరిగిన అత్యాచారం కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చీరాల పట్టణంలోని పోలీసు నివాస గృహ సముదాయాలను ఎస్పీ పరిశీలించారు. ముత్యాలపేట పద్మశాలి కల్యాణ మండపం, యద్దనపూడిలో నిర్మాణంలో ఉన్న స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న పోలీసు సిబ్బంది నివాస సముదాయాన్ని పరిశీలించారు. ప్రస్తుతం సిబ్బంది అక్కడ నివాసం ఉండడం లేదని స్థానిక అధికారులు తెలిపారు.
ఇది చదవండి: