రైతుల ఆర్థికాభివృద్ధి కోసం నాబార్థు ద్వారా వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ చెప్పారు. వ్యవసాయ రంగంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రైతులకు బహుళ ప్రయోజనాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డ్ సంయుక్తంగా నిధిని వినియోగించనుందని తెలిపారు. ఈ నిధి క్రింద రూ.6,840 కోట్లు రాష్ట్రానికి నాబార్డు మంజూరు చేసిందన్నారు. పరిశ్రమలను రైతులే స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్నపాటి పరిశ్రమలు స్థాపించుకొని మార్కెట్ సౌకర్యంతో బహుళ ప్రయోజనాలు పొందడానికి నాబార్డు నిధులు వెచ్చించనుందన్నారు. నాబార్డు నిధులను వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలకు, రైతులకు వ్యక్తిగతంగా రుణ సదుపాయం నాబార్డు కల్పిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఒక్కొక్క యూనిట్‌కు రూ.2 లక్షల నుంచి సుమారు రూ.10 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. రూ. 2 కోట్ల విలువైన యూనిట్లలోపు రుణం పొందేవారికి రైతుల ప్రయోజనం కోసం 3 శాతం వడ్డీ రాయితీ అమలు చేస్తుందన్నారు. వీటితోపాటు రైతుల ఇబ్బందులు తొలగించడానికి రూ.2 కోట్ల వరకు హామీలేని రుణాలను మంజూరు చేయనుందని వివరించారు. రైతుల చెంతకే వివిధ ప్రయోజనాలను ప్రభుత్వం తెస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై జిల్లాలో వున్న 175 రైతు సహకార సంఘాలకు అవగాహన కల్పించాలన్నారు.
నాబార్డు నిధుల వినియోగంపై జిల్లా స్థాయి కమిటీలను కలెక్టర్ నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్ వుంటారని, వైస్ ఛైర్మన్, కన్వీనర్‌గా జిల్లా సంయుక్త కలెక్టర్ వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. వైస్ చైర్మన్‌గా జిల్లా పరిషత్ సీఈవో, కమిటీ సభ్యులుగా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, సహకార శాఖ అధికారులు, సొసైటీ సభ్యులు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు, మత్స్య శాఖ సహాయ సంచాలకులుగా ఉంటారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో నాబార్డు డీడీఎం వెంకట నారాయణ, ఎల్డీఎం యుగంధర్, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, మత్స్య శాఖ జెేడీ చంద్రశేఖర రెడ్డి, ఉద్యానవన శాఖ ఏడీ., వ్యవసాయ సహకార సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు
ఇదీ చూడండి. ప్రభుత్వం, అధికారులు.. దేవాలయాల జోలికి రావొద్దు: పరిపూర్ణానంద