మద్యం కంటే తేలికగా, చవకగా దుకాణాల్లో లభ్యమవుతున్న ఆ ద్రావణాన్ని తాగితే మరింత మత్తుగా ఉంటోందని భావించారు. కానీ అదే రసాయనం తమను ఈ లోకానికి దూరం చేస్తుందని ఊహించలేకపోయారు. ఒకరి నుంచి మరొకరిగా ఈ వ్యసనం పలువురికి పాకింది. గుంపులుగా చేరి కొందరు.. ఊరి చివర చెట్ల కింద చేరి మరికొందరు.. ఇళ్లలోనే ఇంకొందరు పది రోజులుగా గరళాన్ని కడుపులో నింపుకొంటున్నారు. చివరికి అదే వ్యసనం వారిని చితి పైకి చేర్చింది. తమ కుటుంబాల పరిస్థితిని దయనీయంగా మార్చింది.
వారం రోజులుగా తాగుతూ...
కురిచేడులో మత్తు కోసం శానిటైజర్లు తాగి గురు, శుక్రవారాల్లో మృతి చెందినవారి సంఖ్య 13కు చేరింది. వీరిలో ముగ్గురు యాచకులు. మిగిలినవారు కురిచేడు గ్రామస్థులు. చనిపోయిన వారందరిదీ రెక్కాడితే కానీ డొక్కాడని ఆర్థికపరిస్థితి. మృతుల్లో ముఠా పని చేసుకునే వారు కొందరైతే, కూలి పని చేస్తూ జీవించేవారు మరికొందరు. రిక్షా, ఆటో నడిపేవారు, తోపుడు బండిపై పండ్లు విక్రయించుకుంటూ బతుకు బండి సాగించేవారు, టీ కొట్టు నడుపుకొనేవారు ఇంకొందరు. నేపథ్యాలు వేరైనప్పటికీ.. మత్తు వారందరినీ ఒక్కటి చేసింది. లాక్‌డౌన్‌తో ఉపాధి లేకపోవడంతో ఖాళీగా గడిపే సమయంలో వ్యసనం వారిని మృత్యువు దరి చేర్చింది. గ్రామంలో పాజిటివ్ కేసులు పెరగడంతో మండల కేంద్రంలో ఉన్న రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలు పది రోజులుగా మూతపడ్డాయి. మత్తుకు బానిసలైన వారంతా చేతులు శుభ్రం చేసుకోవడానికి వినియోగించే శానిటైజర్ తాగడాన్ని అలవాటుగా చేసుకున్నారు. అదే తమ గొంతులు గరళంగా మారి ప్రాణాలు తీస్తుందని తెలుసుకోలేకపోయారు. వారం రోజులుగా తాగుతున్న వారిలో పన్నెండు మంది రెండు రోజుల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. ఓ వ్యక్తి విషమ పరిస్థితుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతం తీవ్ర విషాదం నింపింది.
విషాద సంఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వైద్యచికిత్స పొందుతున్న శ్రీనును వివరాలు అడిగారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ.. మత్తుకు బానిసలైన కొందరు శానిటైజర్లు తాగి మృతిచెందడం బాధాకరం అన్నారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మార్కాపురం డివిజన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ.. కురిచేడులోని దుకాణాల్లో పరిశీలించి శానిటైజర్ స్టాక్‌ను స్వాధీనం చేసుకుంటామన్నారు. మృతులు తాగిన సీసాలను పరీక్ష నిమిత్తం విజయవాడ ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు.
ఆగిన ఆటో చక్రం...
కడియం రమణయ్య(28) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు లేరు. తల్లిదండ్రులిద్దరూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద టీ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కరోనా కారణంగా ఆ ఆసరా కూడా లేకుండా పోయింది. శానిటైజర్ తాగి రమణయ్య మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
ముఠా పని లేక...
అనుగొండ శ్రీను(22) గ్రామంలో దుకాణాల వద్ద ముఠా పని చేస్తూ జీవనం సాగించేవారు. కొన్ని రోజులుగా పని దొరకని పరిస్థితి. భార్య వెంకట సుబ్బులు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఆరేళ్ల బాబు, అయిదేళ్ల పాప. మద్యానికి అలవాటు పడిన శ్రీను ఇతరులను చూసి తానూ శానిటైజర్ తాగడం ప్రారంభించారు. పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు. భర్తను కోల్పోయిన భార్య.. పిల్లలిద్దరితో కలిసి దీనంగా రోదిస్తుండటం చూపరులను కలచి వేసింది.
అనాథలైన చిన్నారులు...
మాడుగుల చార్లెస్(36) రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అతని భార్య మరియమ్మ పదిహేనేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి చార్లెస్ రిక్షా తొక్కుతూ ఇద్దరు కుమారులు, కుమార్తెను పోషిస్తూ వచ్చారు. శానిటైజర్ తాగి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచారు. తల్లిదండ్రులిద్దరి మృతితో పిల్లలు అనాథలుగా మిగిలారు.
ఇంటి వద్దనే తాగుతూ...
గుంటక రామిరెడ్డి(57) కూలి పనులకు వెళ్తూ జీవనం సాగించేవారు. భార్య నరసమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయిదుగురికీ వివాహాలయ్యాయి. రామిరెడ్డి శానిటైజర్ తాగి మృతి చెందటంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గోడ మీద శానిటైజర్ డబ్బాలు పెట్టి రోజూ తాగుతుంటే మద్యం అనుకున్నామని, తీరా అది ప్రాణాలు తీసే ద్రావణం అని తెలుసుకోలేకపోయామని వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.
తోపుడు బండి ఇక నడవదు...
కుందా అగస్టిన్(42) తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించేవారు. అగస్టిన్‌కు భార్య సామేలు, నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్ద మరణంతో భార్యాపిల్లలు విషాదంలో మునిగిపోయారు. మృతదేహం వద్ద వారి రోదనలను చూసిన పలువురు కంట తడి పెట్టుకున్నారు.
కుమారుని మృతితో బానిసై...
పాలెపోగు దాసు(70) కురిచేడులో ఎన్నెస్పీ కాలువపై లష్కర్‌గా పని చేసి విరమణ పొందారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు. పదేళ్ల క్రితం దాసు కుమారుడు అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి ఆయన మద్యానికి బానిసయ్యారు. ఇటీవల మద్యం దుకాణాలు తెరవకపోవడంతో మత్తు కోసం శానిటైజర్ తాగడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రాణాలు విడిచారు.
తోటి వారిని చూసి తానూ...
షేక్ సైదా(30) తల్లిదండ్రుల వద్ద ఉంటూ లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. తనతోపాటు ఉన్న వారు శానిటైజర్ తాగుతుండటం చూసి తానూ అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురై గురువారం ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ప్రాణాలు విడిచారు. అతని మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
వివాహానికొచ్చి...
మాతంగి పెద్ద సుబ్బారావు(62)ది కురిచేడు గ్రామం. గత ఇరవై సంవత్సరాలుగా గుంటూరు మిర్చి యార్డు సమీపంలో కుటుంబంతో కలిసి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జులై 29న కురిచేడులో తన బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు వచ్చారు. గ్రామంలో కొంతమంది మద్యం ప్రియులు శానిటైజర్లు తాగడం చూశారు. తానూ కొనుగోలు చేసి తాగారు. జులై 30వ తేదీ రాత్రి ఆరోగ్యం విషమించడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. ఆయనకు భార్య శీరమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
బిక్షాటన చేస్తూ...
రాజారెడ్డి(65) కురిచేడు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం పక్కనే గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. గ్రామంలో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాజారెడ్డికి భార్య భాను ఉంది. కోనగిరి రమణయ్య(45)ది కర్నూల్ జిల్లా బనగానపల్లె. ఇతను కూడా కొంతకాలంగా గ్రామంలో బిక్షాటన చేస్తూ స్థానిక పోలేరమ్మ ఆలయం వద్ద నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ శానిటైజర్ తాగి ప్రాణాలు విడిచారు.