Fake Gold Biscuits: ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో నకిలీ బంగారు బిస్కెట్లు విక్రయిస్తూ.. ప్రజలను మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బెస్తవారిపేట మండలం చిన్న ఓబునేని పల్లి గ్రామానికి చెందిన గురువర్ కుమార్కు.. సురేష్ అనే వ్యక్తి రెండు నెలల నుంచి పరిచయం. సురేష్.. కోటేశ్వరమ్మ అనే మరో మహిళతో కలసి మోసానికి తెరలేపాడు. మాయమాటలతో నమ్మించి.. తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామని చెప్పి.. గురువర్ కుమార్ దగ్గర రెండు లక్షల రూపాయలు కాజేశారు. తరువాత దానిని గురువర్ కుమార్ వేరే ప్రాంతంలో పరిశీలించగా అది నకిలీ బంగారం అని.. నమ్మించి మోసం చేశారని తెలుసుకున్నాడు. బేస్తవారిపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందుతులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వీరిపై గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్టు తెలిపారు. దీనిపై పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లాకు చెందిన సురేష్, కోటేశ్వరమ్మ.. ముందుగా ప్రజలను ఫోన్ ద్వారా పరిచయం చేసుకుంటారు. మాయమాటలతో నమ్మిస్తారు. తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు అని చెప్పి ఆశ చూపిస్తారు. బిస్కెట్లను పరిశీలించడానికి చూపించేటప్పుడు.. కొంత మేర ఒరిజినల్ బంగారం పెడతారు. దీంతో మొత్తం.. నిజమైన బంగారం అని నమ్మి ప్రజలు మోస పోతున్నారు.
ఇవీ చదవండి: