MANN KI BAAT: మన్ కీ బాత్‌లో ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. బాలికల చదువు కోసం కృషి చేస్తున్న మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి అభినందించారు. వందమందికి సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిపించారని.. పదవీవిరమణ తర్వాత వచ్చిన రూ.26 లక్షలను వారి ఖాతాల్లో వేశారని ప్రశంసలు కురిపించారు.
మార్కాపురం రాంభూపాల్ రెడ్డి గిద్దలూరులో ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. అయితే.. ఈ క్రమంలో పేదరికంలో చదువుతున్న విద్యార్థులపై మమకారం మాత్రం ఆయన మరువలేదు.
స్కూల్లో పనిచేస్తున్న సమయంలోనే పేద బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత తనకు వచ్చిన 26 లక్షల రూపాయల నగదును స్థానిక పోస్టాఫీస్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అనంతరం దానిపై వచ్చిన వడ్డీని సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పేద బాలికల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసి, వారికి డబ్బులు జమ చేశారు. నేటి మన్ కీ బాత్ కార్యక్రమంలో.. ఈ విషయమై రాంభూపాల్‌రెడ్డిని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఇవీ చదవండి: