కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, తమ ముఖ్యమంత్రిగానే వై.ఎస్.రాజశేఖరరెడ్డిని చూస్తామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, పథకాలు వై.ఎస్. అమలు చేశారని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాజశేఖరరెడ్డి పుట్టిన రోజు కానుకగా మండలి ఏర్పాటుకు తామంతా మద్దతు తెలిపామని... కానీ ఒక బిల్లును వ్యతిరేకించిందని వైకాపా సర్కార్ దాన్ని రద్దు చేయడం అన్యాయమని విమర్శించారు. ప్రభుత్వ పథకాలపైనా వైఎస్ చిత్రం కనుమరుగవుతోందని పేర్కొన్నారు. ఎన్నికల వరకూ రాజశేఖరరెడ్డి సెంటిమెంట్‌ను జగన్ వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు వై.ఎస్. మార్క్‌ను క్రమంగా చెరిపేసి... తన వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోడానికి ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఆ ఒప్పందం ఏంటి?
చంద్రబాబు హయాంలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు వైకాపా కూడా మద్దతు తెలిపిందని శైలజానాథ్ గుర్తు చేశారు. అప్పట్లో చంద్రబాబుకు, జగన్మోహన్‌రెడ్డిల మధ్య ఏ ఒప్పందం జరిగిందని ప్రశ్నించారు. ఆ ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రాజధాని మార్పు గురించి ప్రస్తావించకుండా... ఇప్పుడు మూడు రాజధానుల ఆలోచన ఏంటని శైలజానాథ్ ప్రశ్నించారు. అమరావతి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు.